ఇందిర‌మ్మ ఇండ్లకు కేంద్ర‌వాటా కోసం ఎదురుచూస్తున్నాం: పొంగులేటి

కలం, వెబ్ డెస్క్: ఇందిర‌మ్మ ఇండ్ల‌కు కేంద్ర‌వాటా కోసం ఎదురుచూస్తున్నామని.. కేంద్రం ఇవ్వ‌క‌పోతే తమ ప్రభుత్వమే భరిస్తోందని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వ వాటాగా రావ‌ల‌సిన నిధుల కోసం ఈ ఏడాది మార్చి నుంచి ఎదురుచూస్తున్నామ‌ని, కేంద్రం ఒక్కో ఇంటికి సుమారు 1లక్షా 13 వేల రూపాయిల వాటా విడుద‌ల కావాల్సి ఉంద‌ని చెప్పారు. కేంద్రం నుంచి నిధుల వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కంతో ఇందిర‌మ్మ ల‌బ్దిదారుల‌కు ఫైన‌ల్ బిల్ ఆప‌డం జ‌రిగింద‌ని వివరించారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతానికి ఒక ఇల్లు కూడా మంజూరు కాలేద‌ని తెలిపారు. ఈ మేరకు శ‌నివారం త‌న ఛాంబ‌ర్‌లో మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా మాట్లాడారు. కేంద్రం విడుద‌ల చేయాల్సిన నిధుల కోసం ప‌లుమార్లు సీఎం రేవంత్ తోపాటు తాను కూడా కేంద్రానికి విన్నవించామని వివరించారు. ఆ నిధుల విడుద‌ల కోసం ప్ర‌య‌త్నిస్తూ మ‌రోవైపు ప్ర‌స్తుతం పూర్త‌యిన ఒక్కో ఇంటికి రూ.1.60 ల‌క్ష‌లను తాత్కాలికంగా ఆపామ‌ని అన్నారు. ఒక‌వేళ కేంద్రం మ‌రో 15-20 రోజుల్లోగా విడుద‌ల చేయ‌క‌పోతే రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే భ‌రించి ల‌బ్దిదారుల‌కు నిధులు అంద‌జేస్తుంద‌న్నారు.

రాష్ట్రంలో తొలివిడ‌త మూడున్న‌ర ల‌క్ష‌లకు పైగా ఇందిర‌మ్మ ఇండ్లు మంజూరు చేయ‌గా.. ఇంత‌వ‌రకు సుమారు 1.32 ల‌క్ష‌ల ఇండ్లు పూర్త‌య్యాయ‌ని వెల్లడించారు. జూన్ నెలాఖ‌రుక‌ల్లా 68-72 వేల ఇండ్లు శ్లాబ్‌ల నిర్మాణం పూర్త‌వుతుంద‌ని వివరించారు. రెండ‌వ విడ‌త ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణ పథకాన్నిసీఎం రేవంత్ జూన్ 2న ఆదిలాబాద్‌లో ప్రారంభిస్తార‌ని తెలిపారు. 2వ విడ‌త మంజూరులో వివిధ రకాల వెసులుబాట్ల‌ను క‌ల్పిస్తామ‌ని అన్నారు. గోడ‌లు, బేస్‌మెంట్ లెవెల్‌, శ్లాబ్ వ‌ర‌కు ఉన్న గోడ‌లు, శ్లాబ్ లేని ఇండ్ల‌కు కూడా ఇందిర‌మ్మ ఇండ్ల‌ను మంజూరు చేస్తామ‌ని చెప్పారు.

రాష్ట్రంలో ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేయాల‌నే అంశాన్ని కూడా ఈనెల 21న మంత్రి వర్గంలో చ‌ర్చించి ప్ర‌క‌టిస్తామ‌ని స్పష్టం చేశారు. గ‌త 25 రోజులుగా రాష్ట్రంలో ఉమ్మ‌డి జిల్లాల ప‌రిధిలో రెవెన్యూ, హౌసింగ్‌, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్, స‌ర్వే అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చించామని తెలిపారు. ప్ర‌జా ప్ర‌తినిధుల నుంచి అభిప్రాయాలు, స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించి కొన్ని విష‌యాల‌పై అక్క‌డిక‌క్క‌డే నిర్ణ‌యాలు తీసుకొని ప‌రిష్క‌రించామని అన్నారు.

గ‌త ప్ర‌భుత్వహ‌యాంలో అసంపూర్తిగా ఉండిపోయిన‌ 2 బీహెచ్‌కే ఇండ్లకు సంబంధించి పాత‌రేట్ల‌తో పూర్తి చేసేలా కాంట్రాక్ట‌ర్ల‌ను కోరామని మంత్రి వివరించారు. అత్య‌ధిక శాతం ఈ ప‌నుల పూర్తికి ముందుకు రానందున ల‌బ్దిదారుల‌ను ఎంపిక చేసి వారికే మిగిలిన మొత్తాన్ని ఇస్తూ వారిచేత‌నే పూర్తిచేయించేలా నిర్ణ‌యించామన్నారు. ఈమేర‌కు ఈనెలాఖరులోగా ఇటువంటి ఇండ్ల‌ను గుర్తించేలా క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలిచ్చామని వెల్లడించారు. ప‌లు ప్రాంతాల్లో 10కిపైగా ఇండ్లు క‌లిగిన ట‌వ‌ర్ల‌ను గుర్తించి వాటికి పాల‌క‌వ‌ర్గాన్ని ఏర్పాటు చేస్తూ, వాటి దిగువ క‌మ‌ర్షియ‌ల్ షాపుల‌ను లీజుకు బ‌దులు పూర్తిగా బ‌హిరంగ వేలంలో విక్ర‌యించి ఆ మొత్తాన్ని ప్ర‌భుత్వ ప్రాతినిధ్యం క‌లిగిన పాల‌క వ‌ర్గం ఖాతాలో వేయాల‌ని నిర్ణ‌యించామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>