కలం, కరీంనగర్ బ్యూరో: విద్యార్థులు చదువుతో పాటు విభిన్న రంగాల్లో రాణించాలని, భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం ఆర్ట్, క్రాఫ్ట్, కల్చరల్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతదేశం సాంస్కృతిక వారసత్వానికి, కళలకు నిలయమన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందున్నప్పుడే వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలరని తెలిపారు.
అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ.. గత విద్యా సంవత్సరంలో విద్యార్థుల అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్ట్, క్రాఫ్ట్ మేళా వంటివి ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రాయింగ్ కాంపిటీషన్, కళా ఉత్సవ్ వంటి కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారని పేర్కొన్నారు. విభిన్న రంగాల్లో అనేక శిక్షణలు ఇప్పించామన్నారు. రానున్న విద్యా సంవత్సరంలోనూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా పలు కార్యక్రమాలు రూపొందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఆర్ట్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. జవహర్ బాల భవన్, కస్తూరిబా పాఠశాలలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, సమగ్ర శిక్ష అభియాన్ కోఆర్డినేటర్లు డి.శ్రీనివాస్, అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, ఉమారాణి, జవహర్ బాల భవన్ సిబ్బంది మంజుల, శ్రీధర్, రాధాకృష్ణ పాల్గొన్నారు.

