Mobile Popup Ad
Mobile Popup Ad

రేపే రెండో విడత ‘ఇందిరమ్మ ఇళ్లు’: పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా ​‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం రెండో విడత మంజూరు ప్రక్రియ జూన్ 1 (సోమవారం) నుంచే ప్రారంభం కానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు, ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లను కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామంలో రూ.5.20 కోట్ల వ్యయంతో పొన్నెకల్లు నుండి కొండాపురం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌లతో కలిసి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇప్పటికే మంజూరైన 4.50 లక్షల ఇళ్లకు సంబంధించి ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు.
​సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఎక్కడా వెనుకడుగు వేయడం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారుల నిర్మాణం ద్వారా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>