కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. గురువారం సత్తుపల్లిలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “పేదవాడికి పార్టీలతో సంబంధం లేదు. పింక్ కలర్ చొక్కా వేసుకున్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన పేదవాడికైనా సరే, అర్హత ఉంటే ఇందిరమ్మ ఇళ్లు తప్పకుండా ఇస్తాం. మేము రాజకీయాలకు అతీతంగా పాలన అందిస్తున్నాం. పేదవాడి మనసును మంచితనంతోనే గెలుస్తామనే నమ్మకం మాకు ఉంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అర్హులైన ఏ ఒక్క పేదవాడు కూడా సంక్షేమ పథకాలకు దూరంగా ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు.

