కలం, వెబ్ డెస్క్: టీం ఇండియా వరల్డ్ కప్ (World Cup) గెలుచుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. క్రికెట్ అభిమానులు రోడ్లపైకి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. విజయవాడలో సైతం గ్రాండ్ సెలబ్రేషన్స్ జరిగాయి. అయితే ఈ వేడుకలపై పోలీసులు లాఠీ ఝులిపించారు. విజయవాడ (Vijayawada) బెంజ్ సర్కిల్‌లో సంబరాలు చేసుకుంటున్న అభిమానులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు జరిపిన దాడిలో ఓ యువకుడి తల పగిలిపోయింది. దీంతో యువత పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు సైతం యువకులను కాళ్లతో తన్నుతూ విచక్షణారహితంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వేడుకల్లో జాతీయ జెండాతో బస్సుపై నిల్చున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

