కలం, వెబ్డెస్క్: పార్లమెంట్ (Parliament) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల ప్రారంభానికి ముందే పార్లమెంట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) నేడు తొలిసారి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఆయనకు బీజేపీ ఎంపీలు స్వాగతం పలుకగా, పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు.
పార్లమెంట్ వద్ద ధర్మేంద్రకు బీజేపీ సహా ఎన్డీఏ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేకమైన తలపాగా అందజేసి పార్లమెంట్లోకి ఆయనను ఆహ్వానించారు. విద్యావ్యవస్థలో సరికొత్త సంస్కరణలు ఆయన తీసుకొచ్చారని.. ఎలాంటి తప్పు చేయకపోయినా.. విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని దేశ భవిష్యత్తు అరాచక వాదుల చేతుల్లోకి వెళ్ళొద్దని తన పదవికి రాజీనామా చేశారని సహచర ఎంపీలు ప్రశంసల్లో ముంచెత్తారు.
ఆయన రాజీనామా చేసిన రోజే చాలామంది బీజేపీ సహా ఎన్డీఏ ఎంపీలు సోషల్ మీడియా వేదికగా ఆయనను పొగుడుతూ మెసేజ్ లు పెట్టారు. సోమవారం పార్లమెంటు ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు వస్తున్న సందర్భంగా ప్రధాన్ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ బీజేపీ ఎంపీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఇండియా కూటమి ఆందోళన
ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ కు బీజేపీ సహా ఎన్డీఏ ఎంపీలు ఘన స్వాగతం పలుకుతుండగా మరోవైపు కాంగ్రెస్ సహా ఇండియా కూటమి ఎంపీలు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాన్ వల్లే నీట్ పేపర్ లీక్ అయిందని, పలువురు విద్యార్థుల ఆత్మహత్యలకు ఆయనే కారణమని మండిపడ్డారు. జంతర్ మంతర్ లో విద్యార్థులు, ప్రతిపక్షాలు చేసిన పోరాటానికి మోది సర్కార్ దిగివచ్చి ప్రధాన్ తో రాజీనామా చేయించిందని.. ఇది యావత్ దేశ యువత సాధించిన విజయమని పేర్కొన్నారు.
ఢిల్లీలో యువతపై జరిగిన లాఠీ చార్జ్, నీట్ పేపర్ లీక్ విషయంలో చర్చ జరగాల్సిందేనని విపక్ష ఎంపీలు పట్టు పడుతున్నారు. ఈ దాడులపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. విపక్షాల ఆందోళనతో ప్రారంభమైన కొద్దిసేపటికే సభను వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి ఉండటంతో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

