కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఇందిరా సౌరగిరి జల వికాసం’ (Indira Soura Giri Scheme) పథకం అమలు నత్తనడకన సాగుతున్నది. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు ఉచితంగా సాగునీటి వసతి కల్పించి, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో గతేడాది ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే పైలట్ ప్రాజెక్టు చేపట్టిన ప్రాంతంలోనే పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో గిరిజన రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఆమ్రాబాద్ మండలం మాచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి లబ్ధిదారులకు సోలార్ పంప్‌సెట్లు పంపిణీ చేశారు.
100 శాతం సబ్సిడీ
ఈ పథకం ద్వారా అర్హులైన పోడు రైతులకు బోరు బావి తవ్వించడంతో పాటు మోటార్, సోలార్ పంప్‌సెట్‌లను 100 శాతం సబ్సిడీతో ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో రైతు కోసం సుమారు రూ.6 లక్షలు ఖర్చు చేస్తున్నది. బోరు తవ్వకం, మోటార్ బిగింపు, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వంటి పనులన్నీ ఇందులో భాగం. వరి సాగుతో పాటు పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.1 లక్షల మంది గిరిజన రైతులకు, 6 లక్షల ఎకరాల పోడు భూములకు సాగునీరు అందించేందుకు వచ్చే నాలుగైదేళ్లలో రూ.12,600 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పథకం అమలు మాత్రం ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు.
పైలట్ ప్రాజెక్టులోనే సమస్యలు
మాచారంలో పైలట్ ప్రాజెక్టు కింద 56 చెంచు కుటుంబాల కోసం 31 బోరు బావులు తవ్వించారు. అయితే వాటిలో కేవలం 17 బోరు బావులకు మాత్రమే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. వాటిలోనూ కొన్ని మోటార్లు పైపుల నుంచి విడిపోయి బావుల్లో పడిపోయాయి. ఈ మోటార్లను బయటకు తీసే సాంకేతిక పరిజ్ఞానం చెంచు రైతులకు అందుబాటులో లేకపోవడంతో పండ్ల తోటలకు సాగునీరు అందడం లేదు. సమస్యను పలుమార్లు ఐటీడీఏ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు సెగ్మెంట్లలో అమలు లక్ష్యం
ఈ పథకాన్ని (Indira Soura Giri Scheme) అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అచ్చంపేట నియోజకవర్గంలోని 58 గ్రామాల్లో 1,827 మంది రైతులకు చెందిన 4,612.4 ఎకరాలకు.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని 24 గ్రామాల్లో 1,083 మంది రైతులకు చెందిన 2,531.1 ఎకరాలకు.. కల్వకుర్తి నియోజకవర్గంలోని 3 గ్రామాల్లో 8 మంది రైతులకు చెందిన 24.5 ఎకరాలకు సాగు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టకున్నది. మొత్తం 85 గ్రామాల్లో 2,918 మంది రైతులకు చెందిన 7,168 ఎకరాల పోడు భూములు ఈ పథకం పరిధిలోకి వస్తున్నాయి. అయితే పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన మాచారంలోనే పనులు సక్రమంగా పూర్తి కాకపోవడంతో, మిగిలిన ప్రాంతాల్లో పథకం అమలుపై గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్టర్ తాళం వేశాడు
ఈ పథకం కింద బోర్లు, మోటార్లు మంజూరైతే.. వాటికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని కాంట్రాక్టర్ తాళం వేసి వెళ్లాడు. నాకున్న మూడు ఎకరాల పొలంలో వరి వేసేందుకు నారుమడులు సిద్ధం చేయాలని అనుకునే టైమ్‌లోనే ఇలా జరిగింది. – లక్ష్మయ్య, లబ్ధిదారుడు
మోటార్లు బాయిలో పడ్డయ్
బోరు వేసి మోటార్లు బిగించినప్పటికీ అవి లోపల పడిపోయాయి. వాటిని బయటకు తీయడానికి ఎవరూ రావడం లేదు. మోటార్లకు రబ్బర్ పైపులు బిగించడంతో అవి జారీ బోరుబావిలో పడిపోయాయి. అలా కాకుండా ఐరన్ పైపులు వేసి ఉంటే ప్రయోజనం ఉండేది. – లింగం, లబ్ధిదారుడు
కలెక్టర్‌కూ ఫిర్యాదు చేశాం
మా గ్రామంలో 31 బోరు మోటార్లు అందించారు. అందులో ఆరు మోటార్లు బిగించినప్పటికీ, అవి బోరుబావుల్లో పడిపోయాయి. వాటిని బయటకు తీయాలని ఏడెనిమిది నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌కు కూడా విజ్ఞప్తి చేశాం. – కాట్రాజు పెద్దిరాజు, మాచారం మాజీ సర్పంచ్.
Read Also: పార్లమెంట్‌కు ధర్మేంద్ర.. ప్రతిపక్ష ఎంపీల ఆందోళన!
Follow Us On : WhatsApp

