కలం, ఖమ్మం బ్యూరో: అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా కొత్తగూడెం (Kothagudem) పట్టణంలోని బస్తీల్లో పోలీసులు ఉక్కుపాదం మోపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో శనివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామా టాకీస్ ప్రాంతం, నెహ్రూ బస్తీలో భారీ ఎత్తున ‘కార్డన్ అండ్ సెర్చ్’ (Cordon and Search) ఆపరేషన్ నిర్వహించారు.
సుమారు 200 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే రోడ్లపై తిరుగుతున్న 82 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 21 వాహనాలపై మొత్తం 151 చలాన్ల ద్వారా రూ. 25,460 జరిమానా విధించగా, సరైన పత్రాలు లేని 3 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతేకాకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపై 4 కేసులు నమోదు చేశారు. ప్రజల భద్రత కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని డీఎస్పీ స్పష్టం చేశారు.
తనిఖీల అనంతరం డీఎస్పీ ఆదినారాయణ స్థానికులతో మాట్లాడుతూ పలు కీలక సూచనలు చేశారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబ జీవితం, భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. ప్రజలు మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరుతూ, నకిలీ లింకులు, ఆన్‌లైన్ పెట్టుబడి మోసాలు, గుర్తుతెలియని ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని, ఎవరికీ బ్యాంక్ వివరాలు గానీ, ఓటీపీలు గానీ చెప్పవద్దని స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరూ వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, మద్యం సేవించకుండా వాహనాలు నడపాలని పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో భాగంగా ఇళ్లు, కాలనీ కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు శ్రీలక్ష్మి, వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, జితేందర్, ఎస్సైలు, కొత్తగూడెం సబ్-డివిజన్ పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలు పాల్గొన్నాయి.

