కలం, వెబ్ డెస్క్ : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలంటూ విపక్ష ఎంపీలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. మంగళవారం పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం (ECI office) వైపు ఇండియా కూటమి ఎంపీలు చేపట్టిన మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై విపక్షాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిరసన చేపట్టారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లకుండా పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎంపీలను నిలువరించారు.
పోలీసులు అడ్డుకోవడంతో రాహుల్‌గాంధీ బారికేడ్లపైకి ఎక్కి జాతీయ జెండాను చేతబట్టి నిరసన తెలిపారు. అనంతరం విపక్ష ఎంపీలు రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు. కార్యాలయం వైపు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సుల్లో తరలించారు. ఈ ఘటనతో ఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విపక్షాల నిరసన నేపథ్యంలో పోలీసులు, భద్రతా బలగాలు భారీగా మోహరించారు.

