కలం, వెబ్ డెస్క్ : ఏపీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితం విశాఖ హిందూస్థాన్ షిప్‌యార్డ్‌లో ఆధునీకరించిన కొత్త ‘స్లిప్‌వే-4’ తో పాటు 300 టన్నుల భారీ గొలియాత్ క్రేన్‌ను ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ క్రమంలో భారత నావికాదళం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మొదటి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ ను జలప్రవేశం చేయించడంతో పాటు, ఐదో ఫ్లీట్ సపోర్ట్ షిప్ నిర్మాణానికి నాందిగా ప్రాజెక్ట్ పనుల ప్రారంభం చేశారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత నౌకాదళం కేవలం స్వదేశీ అవసరాలకే పరిమితం కాకుండా గ్లోబల్ షిప్‌బిల్డింగ్ హబ్‌గా మారే దిశగా అడుగులు వేస్తోందన్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్లిప్‌వే, భారీ గొలియాత్ క్రేన్ల వల్ల హెచ్ఎస్ఎల్లో సుమారు 45,000 టన్నుల బరువు కలిగిన అత్యంత భారీ యుద్ధనౌకలు, సపోర్ట్ నౌకలను వేగంగా నిర్మించే సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంలో భాగంగా రక్షణ రంగంలో దేశీయ తయారీని ప్రోత్సహించడం సైన్యానికి మరింత బలనిరూపణగా మారుతుందని వెల్లడించారు.
కాగా, ఈ ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లు సముద్రంలో సుదీర్ఘకాలం మోహరించే యుద్ధనౌకలకు అవసరమైన ఇంధనం, మందుగుండు సామగ్రి, నిత్యావసరాలను నిరంతరం సరఫరా చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు అంటున్నారు . సుమారు 43,500 టన్నుల బరువుండే ఈ భారీ నౌకల నిర్మాణ ప్రాజెక్టు వల్ల స్థానికంగా భారీగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, విశాఖపట్నం డిఫెన్స్ తయారీ రంగంలో మరింత కీలక కేంద్రంగా నిలుస్తుందని చెబుతున్నారు.

