కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి తెలంగాణకు రాబోతున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. ఈ మేరకు బీజేపీ ఏర్పాట్లు చేయగా, ప్రధాని రాకతో కమలం శ్రేణుల్లో జోష్ నెలకొంది. బెంగళూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:50కి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాల ఫొటో గ్యాలరీని సందర్శించి.. మధ్యాహ్నం 3:25కు HICCకి చేరుకుంటారు. అక్కడ సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇళ్లకు..
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లబోతున్నారు. మొదట జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి.. ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించనున్నారు. అక్కడి నుంచి మాదాపూర్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళుతారు. ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన్ను పరామర్శించి, కాసేపు సమయం గడుపుతారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండనున్నారు.
రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
అనంతరం, ప్రధాని మోదీ సాయంత్రం 6.30 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే సభకు రానున్నారు. రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో సుమారు 3 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి, ప్రసంగించిన తరువాత తిరిగి 7.30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వెళ్లి.. ప్రత్యేక విమానంలో దిల్లీ బయల్దేరుతారు.

