కలం, వెబ్ డెస్క్: దేశ రైతులకు మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకంలో భాగంగా మార్చి 13న ప్రధాని నరేంద్ర మోడీ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడత కింద సుమారు 9.32 కోట్ల మంది రైతులకు రూ. 19,000 కోట్లను అందించనున్నట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ఏటా మూడు విడతలలో రూ. 6,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ నిధులు విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలను కొనుగోలు చేయడానికి రైతులకు (Farmers) ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
గతంలో 2025 ఫిబ్రవరిలో 19వ విడతగా రూ. 22,000 కోట్లను 9.8 కోట్ల మందికి, ఆగస్టులో 20వ విడతగా రూ. 20,500 కోట్లను 9.7 కోట్ల మందికి, నవంబర్‌లో 21వ విడతగా రూ. 18,000 కోట్లను 9 కోట్ల మంది రైతులకు ప్రభుత్వం విడుదల చేసింది. 21వ విడత వరకు మొత్తం రూ. 4.09 లక్షల కోట్లకు పైగా నిధులను పంపిణీ చేసింది. ఈ కిసాన్ పథకం వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ప్రధాన ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకాల్లో ఒకటిగా కొనసాగుతోంది.

