కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో నేడు (మే 21) సాయంత్రం 4 గంటలకు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం (Union Cabinet Meeting) జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన జరిగే ఈ భేటీపై రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కేంద్ర కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటలీ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ ఈ ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. విదేశీ పర్యటన అనంతరం వెంటనే కేబినెట్ సమావేశం నిర్వహించడం రాజకీయంగా, పరిపాలనా పరంగా కీలకంగా భావిస్తున్నారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పనితీరు, వివిధ మంత్రిత్వ శాఖల అమలు కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముంది.
అదేవిధంగా, రాబోయే పార్లమెంట్ సమావేశాలు, కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల రాజకీయ పరిస్థితులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వేగవంతమైన అమలుపై కూడా కేబినెట్‌లో చర్చ జరగవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేబినెట్ విస్తరణపై అధికారిక సమాచారం లేకపోయినా, ఇటీవల ప్రభుత్వ పనితీరుపై జరిగిన సమీక్షల నేపథ్యంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశముందని ఢిల్లీ రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది.

