Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రధాని మోదీ పిలుపు.. తగ్గిన బంగారం కొనుగోళ్లు

కలం, నేషనల్ డెస్క్: దేశ ప్రజలు తన మాట విని బంగారం కొనుగోళ్లు తగ్గించారని, ఇందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ప్రధాని మోదీ (PM Modi)  పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాను చేసిన విజ్ఞప్తులకు దేశ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. అనిశ్చితి పరిస్థితుల్లో పొదుపు చర్యలు పాటించడం భవిష్యత్తుకు ఎంతో మంచిదని తెలిపారు.

ఆదివారం మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్నందున కొంతకాలంపాటు వీలైనంత వరకు బంగారం కొనుగోలు చేయొద్దని కోరిన విషయాన్ని మోదీ గుర్తుచేసుకున్నారు.

మంచి స్పందన వచ్చింది..

‘‘నా విజ్ఞప్తికి ప్రజలు నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రజలు నా సూచనలు పాటిస్తున్నారు. ఇందుకు దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు’’ అని ప్రధాని మోదీ తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వీలైనంత వరకు ఇంటి నుంచే పని చేయాలని, ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, ఏడాది పాటు విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవాలని, స్వదేశీ ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించాలని తాను సూచించినట్టు గుర్తుచేశారు. వంట నూనె వినియోగాన్ని తగ్గించాలని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, బంగారం కొనుగోళ్లను తగ్గించాలని కోరినట్లు తెలిపారు.

చాలా మంది మెసేజ్ చేశారు..

ఈ సూచనలు పాటిస్తున్నట్లు చాలా కుటుంబాలు తనకు మెసేజ్‌లు పంపించాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒకే వైపు వెళ్లేవారు కార్‌పూలింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారని వెల్లడించారు. ఇంట్లో పెళ్లిళ్లు ఉన్నప్పటికీ కొత్త బంగారం కొనకుండా, ఇప్పటికే ఉన్న పాత బంగారాన్ని కరిగించి కొత్త నగలు తయారు చేయించుకుంటున్న కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ఈసారి విదేశీ పర్యటనలను కూడా వాయిదా వేసుకున్నట్లు చాలా మంది సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారని చెప్పారు.

మార్కెట్లు ఏం చెబుతున్నాయి..?

ప్రధాని మోదీ మే 10న బంగారం కొనుగోళ్లు తగ్గించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. తర్వాత బంగారం కొనుగోళ్లల్లో కొంత తగ్గుదల కనిపించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మోదీ ప్రకటనతోపాటు అనేక అంశాలు ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

  • వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన త్రైమాసిక సగటు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ఆధారంగా చేసిన అంచనా ప్రకారం దేశంలో బంగారం కొనుగోళ్లు కొంత తగ్గాయి.
  •  మోదీ పిలుపు ఇవ్వకముందే అంటే ఏప్రిల్ 10 నుంచి మే 10 వరకు దేశంలో సుమారు 50–55 టన్నుల మేర వినియోగదారుల బంగారం డిమాండ్ ఉంది.
  • మే 10 నుంచి జూన్ 10 వరకు అది 38–45 టన్నులకు తగ్గిందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>