Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రధాని తెలంగాణ పర్యటన.. ఎంపీ వద్దిరాజు 12 విజ్ఞప్తులు!

కలం, ఖమ్మం బ్యూరో : ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనను పురస్కరించుకుని, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) తెలంగాణ ప్రజల పక్షాన ఒక సమగ్ర విజ్ఞప్తి పత్రాన్ని విడుదల చేశారు. అందులో భాగంగా కోటి ఎకరాల మాగాణే లక్ష్యంగా నిర్మితమవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వెంటనే జాతీయ హోదా కల్పించాలని ఎంపీ కోరారు. విభజన చట్టంలోని హామీల అమలులో భాగంగా తగిన నిధులు విడుదల చేసి, దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయాలని వద్దిరాజు విజ్ఞప్తి చేశారు.

​ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కీలమైన బయ్యారం ఉక్కు కర్మాగారానికి పచ్చజెండా ఊపాలని డిమాండ్ ఆయన (Vaddiraju Ravichandra) చేశారు. అలాగే ​కేవలం మానుఫ్యాక్చరింగ్ యూనిట్‌తో సరిపెట్టకుండా, ఈ ప్రాంత యువతకు ఉపాధి దొరికేలా పూర్తిస్థాయి ‘కోచ్ ఫ్యాక్టరీ’ని కాజీపేటలో నెలకొల్పాలని కోరారు. రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ తో పాటు ప్రస్తుతం ఉన్న 16 నవోదయాలకు అదనంగా, మిగిలిన 17 జిల్లాలకు కొత్త పాఠశాలలను, అలాగే 2 సైనిక్ స్కూళ్లను మంజూరు చేయాలనీ విజ్ఞాపనలో పేర్కొన్నారు.

జనగణనతో పాటే కులగణన చేపట్టాలని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లతో పాటు ఓబీసీలకు కోటా కల్పించాలని, కేంద్రంలో ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని వద్దిరాజు ప్రధానిని కోరారు. మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులను వేగవంతం చేయడంతో పాటు, ‘దక్షిణ అయోధ్య’ భద్రాచలం వచ్చే భక్తుల కోసం కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మించాలని ప్రతిపాదించారు. శతాబ్ది వేడుకలకు చేరువవుతున్న భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) రైల్వే స్టేషన్‌ను డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే భావోద్వేగాలతో ముడిపడి ఉన్న భద్రాచలం సరిహద్దులోని 5 గ్రామాలను తిరిగి రాష్ట్రంలో కలపాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన ప్రకటనలో అత్యంత ప్రాధాన్యతతో ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

​తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను అందించడం ద్వారా సమాఖ్య స్ఫూర్తిని చాటాలని, ప్రధాని మోదీ తన పర్యటనలో ఈ అంశాలపై సానుకూల నిర్ణయాలు ప్రకటిస్తారని ఎంపీ వద్దిరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>