కలం, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రాష్ట్రాల్లో పలు కీలకమైన మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని మోదీ తన పర్యటనను ఉదయం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో ప్రారంభించనున్నారు. దీనితో పాటు దేశంలో సామాన్యులకు విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో రూపొందించిన సవరించిన ఉడాన్ (UDAN) పథకాన్ని కూడా ఆయన అధికారికంగా ప్రారంభించనున్నారు.
అనంతరం బాలోతరాకు చేరుకోనున్న ప్రధాని మోదీ, అక్కడ రికార్డు స్థాయిలో రూ. 1.06 లక్షల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పనులలో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఈ భారీ కార్యక్రమాల అనంతరం బాలోతరాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అలాగే రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే జైపూర్ మెట్రో రెండో దశ నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
రాజస్థాన్ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ (PM Modi) గుజరాత్‌కు వెళ్లనున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో గల సాణంద్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించనున్నారు. దేశీయంగా సాంకేతిక రంగం, ఎలక్ట్రానిక్స్ తయారీని బలోపేతం చేసే దిశగా ఈ సెమీకండక్టర్ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది.

