బస్సు తుస్సు.. మొరాయిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు, ప్రయాణికులకు చుక్కలే!

కలం, నిర్మల్: పర్యావరణ హితం కోసం అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు (Electric Bus) ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. సౌకర్యం కంటే ఇబ్బందులనే ఎక్కువగా కలిగిస్తున్నాయనే విమర్శలొస్తున్నాయి. తరచూ సాంకేతిక లోపాలు తలెత్తి నడిరోడ్డుపై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు ఎలక్ట్రిక్ బస్సుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

సాంకేతిక లోపాలతో..

ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సులో సాంకేతిక లోపం కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఆ ఘటన అనంతరం ప్రభుత్వం కొన్ని రోజులపాటు ఎలక్ట్రిక్ బస్సుల సేవలను నిలిపివేసి తనిఖీలు చేపట్టింది. అయితే సేవలు పునరుద్ధరించిన తర్వాత కూడా సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు. నిజామాబాద్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులు ప్రతిరోజూ నిర్మల్ మీదుగా సుమారు 30 ట్రిప్పులతో రాకపోకలు కొనసాగిస్తున్నాయి. అవన్నీ తరచుగా మొరాయిస్తున్నాయి.

ప్రయాణికుల భద్రతపై ఆందోళన

గత వారం భారీ వర్షాల సమయంలో నిర్మల్ పట్టణంలో ఓ ఎలక్ట్రిక్ బస్సు సాంకేతిక లోపంతో నడిరోడ్డుపై నిలిచిపోయింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతోపాటు ప్రయాణికులు చాలా సేపు వేచి చూడాల్సి వచ్చింది. అంతలోనే మరో ఘటన చోటుచేసుకుంది. సోన్ మండలం జాతీయ రహదారి–44పై నిజామాబాద్ నుంచి నిర్మల్‌కు వస్తున్న ఎలక్ట్రిక్ బస్సు రాత్రి వేళ ఒక్కసారిగా ఆగిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూసి, చివరకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది.

ఎలక్ట్రిక్ బస్సులు సాంకేతిక లోపాలతో రోడ్డుపైనే ఆగిపోతుండటం ప్రయాణికుల్లో భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. అత్యవసర సమయాల్లో ప్రయాణించే వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో లోపాలను గుర్తించి, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>