కలం, వెబ్ డెస్క్: దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ శనివారం పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇది పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డా- అస్సాంలోని గువాహటి (కామాఖ్య) మధ్య రాకపోకలు కొనసాగిస్తుంది. భారత్‌లో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి వందే భారత్ స్లీపర్ ప్రయాణీకులకు మెరుగైన సేవలందిస్తుందని, విమానంలో ప్రయాణించే అనుభూతిని అందిస్తుందని మోడీ అన్నారు. హౌరా-గువహతి (కామాఖ్య) మార్గంలో అతి తక్కువ సమయంలో ప్రయాణించవచ్చునని, ఈ తరహా రైలు పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని ఇస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
ఈ రైలు గరిష్టంగా గంటకు 120-130 కి.మీ. వేగంతో నడుస్తుంది. బెర్తులు ఎర్గోనామిక్ డిజైన్లను కలిగి ఉండటంతో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. రైలు (Train)లో సూక్ష్మక్రిములను చంపగలిగే కొత్త క్రిమిసంహారక టెక్నాలజీ ఉంటుంది. రైలు స్టేషన్‌కు చేరుకున్నప్పుడు మాత్రమే డోర్లు తెరుచుకుంటాయి. వేగం, పరిశుభ్రత, భద్రతతోపాటు, ఎయిర్‌లైన్ సేవల మాదిరిగానే నోరూరించే వంటకాలను ఈ రైలులో రుచి చూడొచ్చు. దీంతోపాటు ఎన్నో ప్రత్యేకతలున్నాయి.


