ప్రధాని మోదీ కీలక ప్రకటన.. నేపాల్‌కు భారీగా నిధులు

కలం, వెబ్ డెస్క్: నేపాల్ దేశానికి రూ.24 వేల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మోదీ (PM Modi) ప్రకటించారు. ఈ నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్లు వివరించారు. నేపాల్ కేవలం భారత్‌కు పొరుగు దేశం మాత్రమే కాదని.. చారిత్రక–సాంస్కృతిక సంబంధాలు కలిగిన దేశమన్నారు. అందుకు నిదర్శనమే అయోధ్య నుంచి ప్రారంభించిన సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్ రైలు అని పేర్కొన్నారు. అయోధ్య నుంచి సీతమ్మ జన్మస్థానమైన జనకపురి ధామ్ వరకు నడిచే ఈ రైలు మార్గంతో రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు.

గత కొన్నేళ్లుగా నేపాలీలకు పెట్రోలియం, ఇతర నిత్యావసరాల సరకులను భారత్ నిరాటంకంగా సరఫరా చేస్తూనే ఉందని ప్రధాని మోదీ అన్నారు. పొరుగు దేశాలే ప్రథమం అనే సూత్రానికి కట్టుబడి ఉన్న భారత్.. చమురు, ఎరువులు వంటి ఇతర కీలక అవసరాలను కూడా ఎగుమతి చేస్తోందన్నారు. అరుణ్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, మోతిహరి-అమ్లేగంజ్ చమురు పైప్ లైన్ రెండో దశ నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు.

శతాబ్ధాల సంబంధం: బాలేంద్ర షా

భారత్‌తో నేపాలీలకు శతాబ్ధాల సంబంధం ఉందని ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా అన్నారు. ప్రధాని మోదీతో కలిసి జాయింట్ ప్రెస్ మీట్‌లో బాలేంద్ర షా మాట్లాడుతూ.. ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా తమ మధ్య చర్చలు జరిగాయన్నారు. ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు.. త్వరగా పూర్తయి వాటి ఫలాలు ప్రజలకు అందాలని ఆకాంక్షించారు. యువత, రైతులు, ఉద్యోగవకాశాలు, పెట్టుబడులు, వ్యాపార విస్తరణ, ఆవిష్కరణలకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. నేపాల్-భారత్ మధ్య సంబంధాలు మరో స్థాయికి చేరుకుంటాయనే నమ్మకం తనకు ఉందన్నారు. రెండు రోజుల భారత పర్యటన ముగించుకున్న అనంతరం బాలేంద్ర షా తిరిగి నేపాల్ బయల్దేరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>