కలం, వెబ్‌డెస్క్: దేశంలో ఎన్ని కఠిన చట్టాలు అమలవుతున్నా, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆడపిల్లలపై వేధింపులు ఆగడం లేదు. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధురాళ్ల వరకు ఏదో ఒక తీరులో వేధింపులకు గురవుతున్నారు. తాజాగా మంచిర్యాల (Mancherial) జిల్లాలో ఓ వృద్దుడు బాలికను వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నస్పూర్‌లోని నాగార్జున కాలనీలో ఓ వృద్ధుడు కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. తన షాపు వద్దకు వచ్చే బాలికతో రోజూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
సదరు బాలిక ఇంట్లో ఈ విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు షాపు వద్దకు చేరుకున్నారు. సదరు వృద్ధుని అందరూ చితకబాదారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసకున్న పోలీసులు కొద్ది సేపటికి అక్కడికి చేరుకున్నారు. వృద్ధుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో పిల్లల రక్షణపై స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలను ఒంటరిగా ఇంటి వద్ద దుకాణాలకు పంపాలన్నా భయంగా ఉందని, ఆడపిల్లలకు రక్షణ లేకుండా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

