కలం, వెబ్ డెస్క్: కృష్ణా జలాలను ఏపీకి తరలిస్తూ తెలంగాణకు రేవంత్ సర్కార్ అన్యాయం చేస్తుందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ (BRS) పార్టీ భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రానికి తరలించాల్సిన నీటిని రేవంత్ రెడ్డి ఏపీకి తరలించి సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడని బీఆర్ఎస్ తీవ్రంగా ఆరోపిస్తుంది. నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని.. రాష్ట్ర ప్రజానీకానికి ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చింది.
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) మాట్లాడుతూ.. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా, డిసెంబర్ 10న నల్లగొండ పట్టణంలో లక్షలాది మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నల్లగొండ నగారా పేరిట నిర్వహిస్తున్న ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు.
నాగార్జున సాగర్ వద్ద ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు అక్రమమైనదని.. ఈ ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జగదీశ్ రెడ్డి తెలిపారు. రైతులందరూ ఈ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పుకొచ్చారు.

