కేంద్ర మంత్రి చొరవ.. కరీంనగర్‌లో కర్మకాండ నిలయాలు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కేంద్రంలో కర్మకాండ నిలయాల (Funeral Homes) నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. చాలా చోట్ల అద్దె ఇళ్లల్లో నివసిస్తున్న కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి అంత్యక్రియలు ముగిసే వరకు యజమానులు రానివ్వని దుస్థితి నెలకొంది. దీంతో కొంత మంది బంధువుల ఇళ్లకు వెళితే.. మరికొంత మంది కర్మకాండ ముగిసే వరకు స్మశాన వాటికల్లో భార్యాపిల్లలతో బతుకు వెళ్లదీయాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై కరీంనగర్‌లో ఎవరూ ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు. అందులో భాగంగా నగరం నలువైపులా నాలుగు కర్మకాండ నిలయాలను నిర్మించి అందుబాటులోకి తేవాలని సూచించారు.

నగరానికి నలువైపులా..

కేంద్ర మంత్రి సూచన మేరకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు వారం రోజుల క్రితం సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, హైదరాబాద్, వరంగల్ రహదారుల వైపు ఉన్న శ్మశాన వాటికలను సందర్శించారు. అక్కడికి సమీపంలో కర్మకాండ నిలయాలు నిర్మాణానికి అనువైన స్థలాలపై ఆరా తీశారు. అందులో భాగంగా మార్కండేయ నగర్ శ్మశాన వాటిక, కరీంనగర్ ఓల్డ్ సిటీ కేబుల్ బ్రిడ్జి సమీపంలోని శ్మశాన వాటిక, అల్కాపురి శ్మశాన వాటిక, జగిత్యాల రోడ్డులోని రేకుర్తి శ్మశాన వాటిక, మంచిర్యాల రోడ్డులోని శ్మశాన వాటికల సమీప స్థలాలను పరిశీలించారు. స్థలాల ఎంపిక పూర్తయితే జీ+1 పేరిట కరీంనగర్ నలు వైపులా 4 కర్మకాండ నిలయాలను నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో కర్మకాండ నిలయానికి రూ.50 లక్షల చొప్పున వ్యయం చేయాలని భావిస్తున్నారు. కరెంట్, నీటి వసతి, బస చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఈ కర్మకాండ నిలయాల్లో కల్పించనున్నారు.

నామమాత్రపు రుసుము మాత్రమే..

ఈ కర్మకాండ నిలయాలు అందుబాటులోకి వస్తే అద్దె ఇళ్లల్లో నివసిస్తున్న కుటుంబాలకు ఊరట కలగనుంది. కుటుంబ సభ్యులు చనిపోయిన నాటి నుంచి కర్మకాండలు ముగిసే వరకు 13 రోజుల పాటు ఇక్కడే ఆశ్రయం పొందవచ్చు. ఉచితంగా ఆశ్రయం కల్పించడం కన్నా నామమాత్రం రుసుం చెల్లించేలా ఫీజు నిర్ణయించాలని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే కార్పొరేషన్ పాలకవర్గం నిర్ణయాన్ని వెలువరించనుంది. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరీంనగర్‌లో నలు దిక్కుల నాలుగు కర్మకాండ నిలయాలను నిర్మించి ఆశ్రయం కల్పించాలనే ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలిపారు. అతి త్వరలోనే స్థలాల ఎంపికను పూర్తి చేసి కర్మకాండ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>