కలం, తెలంగాణ బ్యూరో: దేశ ఇంధన భద్రతలో మొక్కజొన్న కీలక పాత్ర పోషించనుంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపే ఇ-20 లక్ష్యాన్ని సాధించడంలో మొక్కజొన్న సాగు ప్రధాన వనరుగా మారనుంది. ఇథనాల్ ఉత్పత్తి ద్వారా దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు దేశానికి భారీగా విదేశీ మారకద్రవ్యం ఆదా కానుంది. ఈ నేపథ్యంలో మొక్కజొన్న ఉత్పత్తిని గణనీయంగా పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 2047 నాటికి దేశంలో మొక్కజొన్న ఉత్పత్తిని 100 మిలియన్ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర వ్యవసాయ పరిశోధన, విద్యాశాఖ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.ఎల్.జాట్ వెల్లడించారు. హైదరాబాద్‌లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు తొలి అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సు (International Maize Conference-2026) జరగనుంది.
ఈ సందర్భంగా ఆయన ఆదివారం ఐసీఏఆర్–నార్మ్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసర్చ్ – నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజిమెంట్) ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సోమవారం నుండి మూడురోజులపాటు శంషాబాద్‌లోని జేడీ కన్వెన్షన్ సెంటర్లో తలపెట్టిన ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 500 మందికి పైగా శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశ్రమల ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు హాజరుకానున్నారు. మొక్కజొన్న సాగు, పరిశోధన, ఇథనాల్ ఉత్పత్తి, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ విధానాలపై ఇందులో కీలక చర్చలు జరగనున్నాయి అని వివరించారు.
మొక్కజొన్న కేవలం ఆహార పంటగానే కాకుండా పశువుల దాణా, పశుగ్రాసం, పారిశ్రామిక అవసరాలు, ఇంధన ఉత్పత్తికి కీలక ముడిసరుకుగా మారిందని డాక్టర్ ఎం.ఎల్.జాట్ తెలిపారు. ఇ-20 ఇంధన లక్ష్యంలో మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ ఉత్పత్తికి ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా ముడి చమురు దిగుమతులను తగ్గించవచ్చని, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలగడంతో పాటు రైతులకు అదనపు ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇంధన అవసరాలకు అనుగుణంగా మొక్కజొన్న ఉత్పత్తిని పెంచడం భవిష్యత్తులో కీలకమవుతుందని వివరించారు.
1950-51లో 20 లక్షల టన్నుల కంటే తక్కువగా ఉన్న ఉత్పత్తి 2025-26 నాటికి 5.5 కోట్ల టన్నులకు పైగా చేరింది. ఈ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లి 2047 నాటికి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలన్నది లక్ష్యమని ఐసీఏఆర్ డీజీ జాట్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే అధిక దిగుబడినిచ్చే వంగడాల అభివృద్ధి, ఆధునిక బ్రీడింగ్ పద్ధతులు, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు (ఏఐ), వ్యవసాయ యాంత్రీకరణ, స్మార్ట్ వ్యవసాయ విధానాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగానికి సవాలుగా మారుతున్నాయని డాక్టర్ జాట్ తెలిపారు. కరువు, అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతం అనిశ్చితి వంటి పరిస్థితులను తట్టుకునే మొక్కజొన్న రకాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ అంశాలతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం అందించడం, పంట ఉత్పాదకతను పెంచడం, మొక్కజొన్న ఆధారిత విలువ జోడింపు ఉత్పత్తులను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు చెప్పారు. ‘మారుతున్న ప్రపంచంలో ఆహారం, పశువుల దాణా, పశుగ్రాసం, ఇంధనం, సుస్థిరత కోసం మొక్కజొన్న విప్లవం (ఎం4ఎఫ్ ఎస్ )’ ఇతివృత్తంతో ఈ సదస్సు (International Maize Conference) జరగనుంది. మూడు రోజుల పాటు ప్లీనరీ ఉపన్యాసాలు, సాంకేతిక సమావేశాలు, ప్యానెల్ చర్చలు, పోస్టర్ ప్రదర్శనలు, పరిశ్రమలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, విత్తన ఆవిష్కరణలు, డిజిటల్ వ్యవసాయ పరిష్కారాలు, బయోఎనర్జీ అవకాశాలు, మొక్కజొన్న ఆధారిత విలువ జోడింపు ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు.
మొక్కజొన్న సాంకేతిక నిపుణుల సంఘం (ఎంటీఏఐ), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ), భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్), ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (టీఏఏఎస్), అంతర్జాతీయ మొక్కజొన్న, గోధుమల అభివృద్ధి కేంద్రం (సిమిట్), ఐసీఏఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైజ్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. మొక్కజొన్న ఉత్పత్తి పెంపు, ఇథనాల్ తయారీ, ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం వంటి లక్ష్యాల సాధనలో హైదరాబాద్‌లో జరిగే ఈ అంతర్జాతీయ సదస్సు కీలకంగా నిలవనుంది అని జాట్ పేర్కొన్నారు.

