కలం, వెబ్ డెస్క్: పంజాబ్ (Punjab Kings) జైత్రయాత్రకు రాయస్థాన్ రాయల్స్ బ్రేకులు వేసింది. ఐపీఎల్ 2026లో ఒక్క ఓటమి లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్తున్న పంజాబ్‌కు బుధవారం జరిగిన మ్యాచ్ (PBKS vs RR)లో ఓటమిని రుచి చూపింది రాజస్థాన్ (Rajasthan Royals). 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది ఆర్ఆర్. జైస్వాల్, వైభవ్ అద్భుతమైన ఆరంభాన్ని అందించగా ఫెరీరా, శుభమ్ జట్టుకు విజయాన్ని అందించారు. పంజాబ్ బ్యాటర్లు వీరవిహారం చేసినప్పటికీ రాజస్థాన్ బ్యాటర్లు రాయల్ ఇన్నింగ్స్‌తో విజయాన్ని సాధించారు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ అద్భుతమైన బౌలింగ్ వేసి 4 వికెట్లు పడగొట్టాడు. 223 పరుగుల కొండంత లక్ష్యాన్ని రాజస్థాన్ బ్యాటర్లు అత్యంత సులువుగా ఛేదించి, తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (59) అర్ధ సెంచరీతో రాణించగా, ఆఖర్లో మార్కస్ స్టోయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. స్టోయినిస్ కేవలం 22 బంతుల్లోనే 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో యష్ రాజ్ పుంజా 2 వికెట్లు తీసినప్పటికీ, పంజాబ్ బ్యాటర్ల ధాటికి బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 51 పరుగులు చేయగా, యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కేవలం 16 బంతుల్లోనే 5 సిక్సర్లతో 43 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మధ్యలో యుజ్వేంద్ర చాహల్ తన స్పిన్ మ్యాజిక్‌తో 3 వికెట్లు తీసి రాజస్థాన్‌ను దెబ్బ తీసే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.
చివరి దశలో డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లారు. ఫెరీరా 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, శుభమ్ దూబే కేవలం 12 బంతుల్లో 31 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. రాజస్థాన్ రాయల్స్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో ఏకంగా 68 పరుగులు ఇచ్చి అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు.

