కాంగ్రెస్ వైఖరికి కౌంటర్.. కరీంనగర్ వేదికగా బీజేపీ మాస్టర్ ప్లాన్!

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్​‌లో కమలం కదనరంగంలోకి దిగింది. బీజేపీ తలపెట్టిన మహా పాదయాత్రతో ( Karimnagar BJP Padayatra) ఉత్తర తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఈ నెల 5న కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో పాదయాత్ర నిర్వహించ నుండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లువెత్తుతోంది.“ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.. అరాచకాన్ని తరిమికొడదాం” అనే నినాదంతో నిర్వహించే పాదయాత్రకు 50 వేల మంది జన సమీకరణ చేసి రాజకీయంగా బలం చాటుకునేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది.

విపక్షాల కుట్రలను తిప్పికొట్టేందుకు..

కరీంనగర్​‌లోని కార్ఖానాగడ్డ గాంధీ బొమ్మ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర వైశ్యాభవన్, టవర్ సర్కిల్, శాస్త్రీ రోడ్ మీదుగా కమాన్ జంక్షన్ వరకు సుమారు కిలోమీటరున్నర కొనసాగనున్నది. సర్ పై కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాల ను, విమర్శలను తిప్పికొడుతూ.. ప్రజల్లోనే ఎండగట్టడమే పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పార్టీ చేపట్టిన 40 భారీ ర్యాలీల్లో భాగంగా కరీంనగర్ యాత్రను ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు.

భారీగా జనసమీకరణకు ప్లాన్

కాంగ్రెస్ వైఖరిపై ఎదురుదాడి పెంచడమే లక్ష్యంగా కరీంనగర్ వేదికగా పొలిటికల్ స్కెచ్‌తో బీజేపీ వ్యూహం పన్నుతూ ముందుకు సాగుతోంది. నితిన్ నబీన్ కరీంనగర్ పర్యటన ఖరారు కావడంతో నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు, సోషల్ మీడియా ప్రచారంతో జోన్ నెలకొంది. భారీగా జన సమీకరణ చేసి, ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్లాన్ చేశారు. సర్ పై అపోహలను తొలగించి, నిజాలను సామాన్య ప్రజలకు వివరించడానికే మహా పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

అవినీతి ఆరోపణలు వస్తే బ్లాక్ లిస్టులోకి..

మహా పాదయాత్ర పనుల్లో భాగంగా ఆదివారం పార్టీ సన్నాహక సమావేశంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పార్టీ స్థానిక నేతలు, కార్పొరేటర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఏ చిన్న అవినీతి ఆరోపణ వచ్చినా, వ్యాపారుల వద్ద లేదా పర్మిషన్ల పేరిట నిధులు వసూలు చేసినట్లు తేలినా సదరు నేతలను ‘బ్లాక్ లిస్ట్’లో పెడతానని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి విశ్వాసం పొందాలే తప్ప ఆరోపణలకు తావివ్వకూడదని సూచించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ చల్లా సునీల్ రావు, మహిళా మోర్చా నేతల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టనుండగా.. కరీంనగర్ లో సరికొత్త రాజకీయ సమీకరణలకు దారితీసింది.

క్షేత్రస్థాయిలో నిమగ్నమైన కేడర్

డివిజన్ల వారీగా బయటి ప్రాంతాల నుంచి ఇన్‌చార్జ్ లను నియమించడంతో గ్రామాలు, మండలాల నుంచి వేలాదిగా కేడర్‌ను తరలించేందుకు ప్లాన్ రూపొందించారు. మాజీ మేయర్ డి. శంకర్, బాస సత్యనారాయణ, నల్లాల ఒదేలు, గుజ్జ శ్రీనివాస్ తదితర నేతలు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో యాత్రను విజయవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. నితిన్ నబీన్ రాకతో రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్ మళ్లీ చర్చనీయాంశంగా మారడమే కాకుండా రాబోయే రోజుల్లో పోరాటాలను మరింత తీవ్రం చేసేందుకు బీజేపీకి పాదయాత్ర ఉత్సాహం నింపుతుందని భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>