నేడు హైదరాబాద్​ కు అమిత్​ షా.. రాష్ట్రంలో పొలిటికల్​ హీట్..!

కలం, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హైదరాబాద్‌లో (Amit Shah Hyderabad Visit) పర్యటించనున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పర్యటనకు తెలంగాణ బీజేపీ నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్​ నగరంలో నిర్వహించనున్న మహా పాదయాత్రకు లక్ష మందికి పైగా ప్రజలను సమీకరించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పాదయాత్రను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలతో చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ భారీగా ప్రజలను భాగస్వాములను చేయాలని నాయకులకు సూచించారు.

పర్యటన షెడ్యూల్

సోమవారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా.. అక్కడి నుంచి నేరుగా కాకతీయ హోటల్‌కు వెళ్తారు. అక్కడ సుమారు రెండు గంటల పాటు తెలంగాణలో పార్టీ పరిస్థితి, రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో చర్చించనున్నారు.

పాదయాత్ర వివరాలు

హోటల్ సమావేశం అనంతరం ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం – అరాచకాన్ని తరిమికొడదాం’’అనే నినాదంతో నిర్వహించే కార్యక్రమంలో అమిత్​ షా పాల్గొంటారు. మధ్యాహ్నం 3.50 గంటలకు నిజాం కాలేజీ వద్దకు చేరుకుంటారు. అక్కడ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం సమీపం నుంచి మధ్యాహ్నం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానున్నది. నిజాం కాలేజీ వద్ద ప్రారంభమయ్యే ఈ యాత్ర అబిడ్స్ మీదుగా మొజంజాహీ మార్కెట్ చౌరస్తా వరకు కొనసాగనున్నది. ఈ కార్యక్రమంలో అమిత్ షాతో పాటు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వడమే ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని బీజేపీ నాయకత్వం తెలిపింది.

మొజంజాహీ మార్కెట్‌లో కార్నర్ మీటింగ్

పాదయాత్ర ముగిసిన అనంతరం మొజంజాహీ మార్కెట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో అమిత్ షా ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల వరకు ఈ సమావేశం ఉంటుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిపోతారు. సుమారు 4 గంటల పాటు సాగే అమిత్ షా హైదరాబాద్ పర్యటన (Amit Shah Hyderabad Visit) ను విజయవంతం చేసేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు దృష్టి సారించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>