కలం, వెబ్ డెస్క్ : మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ప్రతి నెలా వాడే నాప్‌కిన్లపై ఇంతకాలం అమలైన ‘పీరియడ్ టాక్స్’, (‘పింక్ టాక్స్’) రద్దయింది (Pink Tax Abolished). ఈ మేరకు బడ్జెట్ ద్వారా ప్రభుత్వం హామీ ఇచ్చింది. జనాభా నియంత్రణ కోసం వాడే గర్భ నిరోధకాలపైన కూడా పన్నును పూర్తిగా ఎత్తేసింది. సేల్స్ టాక్స్ రూపంలో విధిస్తున్న 18% పన్నును మొత్తానికి తీసేసింది. ఇంతకాలం అదనంగా పింక్ టాక్స్ పేరుతో విధించిన పన్నులను, సేల్స్ టాక్స్ రూపంలో విధించిన పన్నులను మొత్తానికే ఎత్తేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.
లగ్జరీ వస్తువులకు పన్ను మినహాయింపు ఇచ్చి మహిళల ప్రాథమిక శారీరక అవసరమైన శానిటరీ ఉత్పత్తులను మాత్రం “లగ్జరీ వస్తువులు”గా పరిగణించి పన్ను వేయడాన్ని ఆ దేశంలోని హక్కుల సంఘాల, మహిళా సంఘాల కార్యకర్తలు ఇంతకాలం తీవ్రంగా వ్యతిరేకించారు. నాలుగేండ్ల క్రితం మహ్వారీ జస్టిస్ అనే ఓ సామాజిక స్వచ్ఛంద సంస్థ నాప్‌కిన్లపై పన్నును రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యమాన్నే నిర్వహించింది. మహనూర్ ఒమర్ అనే మహిళా న్యాయవాది లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేసి మహిళలు ప్రతి నెలా వాడే నాప్‌కిన్లను లగ్జరీ వస్తువులుగా ప్రభుత్వం పేర్కొనడాన్ని సవాలు చేసి ఈ పీరియడ్ టాక్స్ లేదా పింక్ టాక్స్ రద్దు చేయాలని కోరారు.
టైమ్ మ్యాగజైన్ ఆమెను 2026 సంవత్సరానికి ‘ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపిక చేసింది. పన్నుల భారం కారణంగా శానిటరీ ప్యాడ్‌ల రిటైల్ ధర దాదాపు 40% వరకు పెరుగుతున్నదని, దీనివల్ల పేద, గ్రామీణ మహిళలకు ఇవి అందుబాటులో లేకుండా పోయి ‘పీరియడ్ పావర్టీ’ (రుతుక్రమ ఉత్పత్తులను కొనుగోలు చేయలేని పేదరికం) పెరిగిందని యూనిసెఫ్ పలుమార్లు వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లో ఒక సాధారణ నాప్‌కిన్స్ ప్యాకెట్ రేటు దాదాపు రూ. 450గా ఉంటున్నందున పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు ప్రతి నెలా కొనడం ఆర్థిక భారమేనని యూనిసెఫ్ గతంలో వ్యాఖ్యానించింది.
కేవలం 12% మంది మహిళలు మాత్రమే వీటిని కొని వాడుకోగలుగుతున్నారని పేర్కొన్నది. దీనికి ప్రత్యామ్నాయంగా క్లాత్ వాడాల్సి వస్తున్నదని, అది మహిళల ఆరోగ్యంపై చాలా దుష్పరిణామంగా మారుతున్నదని వ్యాఖ్యానించింది. ఒకవైపు హక్కుల, మహిళా సంఘాల ఆందోళనలు, మరోవైపు యూనిసెఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్టకేలకు పీరియడ్ టాక్స్ (Pink Tax Abolished) పూర్తిగా రద్దు చేయక తప్పలేదు.
Read Also: బరువు తగ్గాలనుకుంటున్నారా? మధ్యాహ్నం ఈ తప్పులు చేయకండి!
Follow Us On: Sharechat

