కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండవేడిమితోడు హీట్ వేవ్స్ (Heat Waves)తో ప్రజలు భయపడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఎండవేడిమి తట్టుకోలేకపోతున్నారు. ఇక సాయంత్రం సమయంలో భూమి నుంచి వెదజల్లే వేడితో తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. సామాన్య ప్రజలు కూలర్లు వాడినా తాత్కాలిక ఉపశమనే తప్ప.. కనీసం 5 నిముషాలు బయటికి వెళ్లొచ్చినా ఉక్కపోతను భరించేలేనంతగా ఉంటుందని వాపోతున్నారు. రాష్ట్రంలో గురువారం నుంచి ఎండలు మరింత ఠారెత్తించనున్నాయి. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీచే ఛాన్స్ ఉంది.
ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నందున ప్రజలు.. తమ ప్రయాణాలు నిలిపివేసుకోవాలని, చల్లని పూట ప్రయాణాలు చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండ వేడిమి దృష్ట్యా ఇంట్లో నిమ్మరసం, మజ్జిగ, బెల్లం పానకం వంటి పానీయాలు తీసుకోవడం ద్వారా శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుందని, తక్షణ శక్తితో అలసిపోకుండా ఉంటామని చెబుతున్నారు. ఎండలో ప్రయాణం చేసొచ్చిన వెంటనే.. దాహార్తిని తీర్చుకోవడానికి హెవీ కూల్ గా ఉన్న శీతల పానీయాలు తాగవద్దని హెచ్చరిస్తున్నారు. వేడిగా ఉన్న శరీరం, ఒక్కసారిగా చల్లని పానీయాన్ని స్వీకరిస్తే ఆరోగ్య కరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రయాణం చేసిన వారు చల్లని ప్రదేశాల్లో సేద తీరాక.. కాళ్లు, చేతులు కడుక్కొని లేదా స్నానం చేసైనా ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణలోని అన్ని జిల్లాలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం నల్గొండ జిల్లాలో 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. జగిత్యాల జిల్లాలోl 43.4, నిర్మల్ 43.3, నిజామాబాద్ జిల్లాలో 43.3, ఆదిలాబాద్ జిల్లాలో 43.2, సిద్ధిపేట జిల్లాలో 42.9, కామారెడ్డి జిల్లాలో 42.8, కరీంనగర్ జిల్లాలో 42.8, జిల్లాలో జిల్లాలో 42.8, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 42.8, సంగారెడ్డి జిల్లాలో 42.8, గద్వాల్ జిల్లాలో 42.7, ఆసిఫాబాద్ జిల్లాలో 42.7, నాగర్ కర్నూల్ జిల్లాలో 42.7, పెద్దపల్లి జిల్లాలో 42.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. సోమవారం నిజామాబాద్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 43.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రానున్న వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

