రెండేళ్లు గడుస్తున్నా బీసీలకు ఏం న్యాయం చేశారు?: పెద్దిరెడ్డి

కలం, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా బీసీలకు ఏం న్యాయం చేశారని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ప్రశ్నించారు. బీసీల పట్ల కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరి వ్యవహరిస్తోందని వైయస్ఆర్ సీపీ బీసీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ఆదివారం బీసీ గళం బహిరంగ సభ నిర్వహించింది. ఈ బహిరంగ సభలో పెద్దిరెడ్డి పాల్గొని చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) బీసీలకు వెన్నంటే ఉంటూ అధికారంలో వారిని భాగస్వామ్యులను చేశారని చెప్పారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు బీసీలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మరచి స్వలాభాలు చూసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలకు సరైన గౌరవం, సముచిన స్థానం కల్పించే శక్తి జగన్ మోహన్ రెడ్డికి తప్ప ఇంకెవ్వరికీ లేదన్నారు. రానున్న రోజుల్లో బీసీలు అందరూ ఏకతాటిపైకి వచ్చి జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. జగన్ తోనే బీసీల అభ్యున్నతి సాధ్యమని అభిప్రాయపడ్డారు.

బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాదు బ్యాక్ బోన్ అని చాటి చెప్పిన ఏకైన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని జిల్లా వైసీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల సమయంలో బీసీ గర్జన లో జగన్ ఏదైతే హామీలు ఇచ్చారో అధికారంలోకి వచ్చిన తరువాత వాటన్నింటినీ తూ.చా. తప్పకుండా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. బీసీల సంక్షేమం కోసం లక్షా ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 24 మంది మంత్రులకు గాను 11 మంది బీసీ లను మంత్రులను చేశారని గుర్తు చేశారు. మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల్లో బీసీలకు చేసింది ఏంటి అని ప్రశ్నించారు. అందరూ ఐక్యతతో కూటమి ప్రభుత్వంపై పోరాడుతూ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సామాన్య కార్యకర్తగా ఉన్న తనను గుర్తించి జగన్ ఎమ్మెల్సీని చేశారని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కొనియాడారు. బీసీలు అంటే జగన్, జగన్ అంటే బీసీలు అని నినదించారు. చంద్రబాబు (CM Chandhrababu) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా బీసీలకు ఇచ్చిన హామీలను (BC promises) మాత్రం అమలు చేయలేదన్నారు. బీసీ ఆడబిడ్డలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్న హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. 2024 ఎన్నికల సమయంలో బీసీలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని చంద్రబాబు తుంగలో తొక్కారని విమర్శించారు. బీసీలకు న్యాయం చేసే ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనన్నారు. వైయస్ఆర్ సీపీ బీసీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ..గత ఎన్నికల సమయంలో బీసీలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పేరుతో బీసీలపై అక్రమ కేసులు పెడుతూ బీసీలను అణచివేతకు గురి చేస్తున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి బీసీలను బ్యాక్ బోన్ గా చూస్తూ రాజ్యాధికారంలో భాగస్వామ్యులను చేస్తే.. చంద్రబాబు బీసీల హక్కుల కాలరాస్తున్నారని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు అనంతపురం జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్, ఎమ్మెల్సీలు భరత్, మంగమ్మ, శివరామిరెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, వైయస్ఆర్ సీపీ పార్లమెంట్ పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, బీసీ విభాగం ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్దఎత్తున హాజరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>