కలం, కరీంనగర్ బ్యూరో (పెద్దపల్లి): విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ చెలగాటం ఆడుతున్నారని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు (Vijaya Ramana Rao) ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వరుస పేపర్ లీకేజీలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. విజయరమణా రావు ఆధ్వర్యంలో బుధవారం కమాన్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు, యువజన సంఘాల కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై నరేష్ తదితర పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకుని పక్కకు తొలగించారు. ఆందోళనకారులను నిలువరించి ధర్నాను విరమింపజేశారు.ఈ సందర్భంగా విజయరమణా రావు మీడియాతో మాట్లాడుతూ దేశంలో గడిచిన 12 ఏళ్ల పాలనలో ఏకంగా 12 సార్లు ప్రశ్నపత్రాలు లీకయ్యాయన్నారు.
నిరుద్యోగ యువత, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం అంధకారంలోకి నెట్టేస్తోందని విజయరమణా రావు ధ్వజమెత్తారు. నీట్ పరీక్ష లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని, మానసిక వేదనతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి విద్యార్థి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, కుటుంబానికి రూ.కోటి చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలన్నారు. లేదంటే రానున్న రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, యువజన సంఘాల కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

