‘నేను బతికే ఉన్నా’.. భూమి కోసం మహిళ ఆందోళన

కలం, పెద్దపల్లి: బతికున్న మహిళను ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో మృతురాలిగా నమోదు చేసి, నకిలీ ధ్రువపత్రాలు, ఫోర్జరీ రికార్డుల ఆధారంగా తన భూమిని ఇతరుల పేర్లకు బదలాయించారని ఆరోపిస్తూ బాధితురాలు సోమవారం పెద్దపల్లి (Peddapalli) కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన అనంతరం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ‘‘రికార్డుల్లో నన్ను చనిపోయినట్లు చూపించారు.. కానీ నేను బతికే ఉన్నాను. నా భూమిని తిరిగి నా పేరుపై నమోదు చేయాలి’’ అంటూ బాధితురాలు ఇస్సావత్‌ సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమిని అక్రమంగా ఇతరుల పేర్లకు బదలాయించేందుకు సహకరించిన పాలకుర్తి తహసీల్దార్‌తో పాటు సంబంధిత అధికారులు, సిబ్బందిపై క్రిమినల్‌, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

24 గుంటల భూమిపై వివాదం

టీఆర్‌పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెరుగు చందర్‌యాదవ్‌ మాట్లాడుతూ పాలకుర్తి మండలం భీమానాయక్‌ తండాకు చెందిన ఇస్సావత్‌ సుజాతకు సర్వే నంబర్‌ 111లో ప్రభుత్వం 24 గుంటల భూమిని కేటాయించిందన్నారు. అయితే సుజాత బతికే ఉన్నప్పటికీ 2006లోనే మృతి చెందినట్లు రికార్డుల్లో నమోదు చేసి, నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి భూమిని ఇతరుల పేర్లకు బదలాయించారని ఆరోపించారు. సుజాత 2006లోనే మృతి చెందినట్లు రికార్డుల్లో నమోదు చేసి ఉంటే, ఆ తర్వాత జరిగిన భూ బదలాయింపు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో డిజిటల్‌ పాస్‌బుక్‌, ఆధార్‌ వంటి గుర్తింపు వివరాలు ఎలా ఉపయోగించబడ్డాయో అధికారులు స్పష్టం చేయాలని చందర్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. వయస్సు, కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు చేశారా? మృతుల పేర్లతో రికార్డులు సృష్టించారా? ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు, డెత్‌ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయా? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు.

రెవెన్యూ రికార్డులపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ డిమాండ్‌

ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సంబంధిత రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్‌ డేటా, అధికారుల లాగిన్‌ వివరాలు, ఆడిట్‌ లాగ్స్‌, సర్వర్‌ లాగ్స్‌ను భద్రపరచాలని చందర్‌యాదవ్‌ కోరారు. డేటాలో మార్పులు ఎప్పుడు, ఎవరి లాగిన్‌ ద్వారా జరిగాయో గుర్తించేందుకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలకు చెందిన అధికారులు లేదా సిబ్బంది పాత్ర ఉన్నట్లు తేలితే ఏసీబీ లేదా విజిలెన్స్‌ ద్వారా స్వతంత్ర ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని అన్నారు. విచారణలో అక్రమాలు, అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ అయితే సంబంధిత అధికారులపై సస్పెన్షన్‌తో పాటు కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలకుర్తి తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చందర్‌యాదవ్‌ విమర్శించారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉన్నప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో కలెక్టర్‌ ప్రజలకు స్పష్టం చేయాలని కోరారు. బాధితురాలికి న్యాయం జరిగేలా వెంటనే విచారణ చేపట్టి, భూమిని తిరిగి ఆమె పేరుపై నమోదు చేయడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో బాధితురాలు ఇస్సావత్‌ సుజాతతో పాటు పాలకుర్తి మండలానికి చెందిన రైతులు, టీఆర్‌పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>