కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపులోని ప్రాథమిక పాఠశాలలో దారుణ ఘటన వెలుగు చూసింది. అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) జిల్లా సహాయ కార్యదర్శి రవికిరణ్ ఆధ్వర్యంలో నాయకులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక వసతులపై పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపయోగించే వాటర్ ట్యాంకులో చనిపోయిన బల్లి కనిపించడంతో షాకయ్యారు. ఆ నీటినే మధ్యాహ్న భోజనం తయారీకి ఉపయోగించినట్లు తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్లి పడిన అపరిశుభ్ర నీటితోనే రోజూ భోజనం వండుతున్నారని, విద్యార్థులకు తాగేందుకు ఇస్తున్నారని తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై పాఠశాల హెచ్‌ఎంను నిలదీయగా సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణి ప్రదర్శించారు.
ట్యాంకును కూడా శుభ్రం చేయరా..?
దీంతో బాధ్యతారాహిత్యానికి నిరసనగా భోజనం పాత్రలను పాఠశాల ముందు పెట్టి రవికిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఫహీం దాదా, సహాయ కార్యదర్శి ఖయ్యూమ్, ఉపాధ్యక్షుడు కోచర్ల రాకేష్, నాయకులు అజయ్, రసూల్, బాబీ తదితరులు ఆందోళనకు దిగారు. పాఠశాల విద్యార్థులపై సిబ్బంది ఎంతటి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారో ఈ ఘటన కళ్లకు కడుతోందన్నారు. పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం అందించాల్సిన అధికారులు వాటర్ ట్యాంకులను కూడా శుభ్రం చేయకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బల్లి పడిన నీటితోనే వంటలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? అని మండిపడ్డారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై తక్షణమే విద్యాశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

