‘భారీ సభ’ ప్రకటన.. చివరకు ఫంక్షన్‌ హాల్‌లో సమావేశం

కలం, మెదక్ బ్యూరో: పటాన్‌చెరువులో (Patancheru) సెక్షన్‌ 22-ఏ బాధితుల పక్షాన బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన నిరసన సమావేశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 15 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రచారం చేసిన పార్టీ.. చివరకు అనుమతుల సమస్యతో ఎమ్మెల్యేకు చెందిన ఫంక్షన్‌ హాల్‌లో బాధితులతో సమావేశం నిర్వహించింది. అయితే సమావేశానికి బాధితుల కంటే పార్టీ కార్యకర్తలే ఎక్కువగా కనిపించడం, ఆశించిన స్థాయిలో బాధితుల నుంచి స్పందన లేకపోవడం చర్చకు దారితీసింది.

జోరుగా ప్రచారం.. భారీ సభకు ప్లాన్‌

పటాన్‌చెరువు నియోజకవర్గంలో 22-ఏ నిషేధిత జాబితాలో చేరిన భూములు, ఫ్లాట్లు, ప్లాట్ల బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ భారీ నిరసన సభకు పిలుపునిచ్చింది. అమీన్‌పూర్‌లోని నవ్య ప్రాంతంలో 15 వేల మందితో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. బీఆర్‌ఎస్‌ ముఖ్యనేత హరీశ్‌రావును (Harish Rao) ముఖ్య అతిథిగా ఆహ్వానించి, ఈ నెల 29న సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలు, తొమ్మిది జీహెచ్‌ఎంసీ డివిజన్లు, మండలాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్రయత్నాలు చేశారు. 22-ఏ అంశం రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదంగా మారడంతో పాటు పటాన్‌చెరువు నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములు నిషేధిత జాబితాలో చేరిన నేపథ్యంలో సభపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

అనుమతి నిరాకరణతో మారిన వేదిక

అమీన్‌పూర్‌లో ఖాళీ స్థలంలో సభ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినప్పటికీ.. అక్కడ ప్రభుత్వ భూములతో పాటు పలు కోర్టు వివాదాల్లో ఉన్న భూములు ఉండటంతో పోలీసులు సభకు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. దీంతో సభను పటాన్‌చెరువులోని ఎమ్మెల్యేకు చెందిన జీఎంఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు మార్చాల్సి వచ్చింది.బహిరంగ సభకు అనుమతి రాకపోవడంతో భారీ సభ కాస్త నిరసన సమావేశంగా మారింది.

బాధితుల కంటే కార్యకర్తలే ఎక్కువ?

ప్రచారం జోరుగా సాగడంతో సెక్షన్‌ 22-ఏ బాధితులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని బీఆర్‌ఎస్‌ నేతలు భావించారు. కాలనీలు, సొసైటీల ప్రతినిధులను సంప్రదించి బాధితులను సమావేశానికి తరలించే ప్రయత్నాలు చేశారు.అయితే సమావేశంలో ఆశించిన స్థాయిలో బాధితులు కనిపించలేదని తెలుస్తోంది. ముఖ్యంగా అమీన్‌పూర్‌, పటాన్‌చెరువు ప్రాంతాల్లోని అనేక కాలనీలు 22-ఏ జాబితాలో ఉన్నప్పటికీ.. అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు హాజరు కాలేదు. దీంతో సమావేశంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలే ఎక్కువగా కనిపించారని, పలువురు గులాబీ కండువాలతో ఉండటంతో వాటిని తొలగించాలని వేదిక నుంచి మైక్‌లో సూచించినట్లు సమాచారం. హరీశ్‌రావు సమావేశానికి చేరుకునే సమయానికి కూడా హాల్‌ పూర్తిస్థాయిలో నిండలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది.

ప్లకార్డులు పట్టుకున్న కార్యకర్తలు

సమావేశానికి వచ్చిన కొందరు పార్టీ కార్యకర్తలు బాధితుల తరహాలో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే భారీగా బాధితులు హాజరవుతారని అంచనా వేసినప్పటికీ.. సంఖ్య తక్కువగా ఉండటంతో స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకత్వం కొంత నిరాశకు గురైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది.అయితే సమావేశానికి వచ్చిన కొందరు బాధితులు హరీశ్‌రావును కలిసి 22-ఏ జాబితా కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు

బాధితుల సమస్యలను విన్న అనంతరం హరీశ్‌రావు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై విమర్శలు చేశారు. 22-ఏ బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

రాజకీయ లబ్ధి కోసమేనా?

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 22-ఏ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే భారీ బహిరంగ సభగా ప్రారంభమైన ప్రచారం చివరకు నామమాత్రపు సమావేశంగా ముగియడంతో ఆశించిన రాజకీయ ప్రభావం కనిపించలేదని కాంగ్రెస్‌, బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సెక్షన్‌ 22-ఏ బాధితుల సమావేశం జరిగిన తీరుపై బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లోనూ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారీ జనసమీకరణతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా 15 వేల మందితో భారీ సభ అంటూ మొదలైన హడావుడి.. చివరకు పరిమిత సంఖ్యలో హాజరైన వారితో సమావేశంగా ముగియడం పటాన్‌చెరువు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>