కలం, రాజన్న సిరిసిల్ల: అనారోగ్యం నయం చేస్తామని, క్షుద్ర పూజలు, మంత్రాలు, గుప్త నిధుల పేరుతో (Black Magic Fraud) ఓ మహిళను నమ్మించి కోటి రూపాయలకు పైగా మోసం చేసిన ఇద్దరు నిందితులను రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.30.50 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు, క్షుద్ర పూజలకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
నిందితులు వీరే..
కరీంనగర్ మంకమ్మతోటకు చెందిన తురుపాటి శ్యాం కుమార్ (57) ప్రస్తుతం హైదరాబాద్లోని తూముకుంటలో నివాసం ఉంటూ ‘భద్రకాళి పూజా స్టోర్’ నిర్వహిస్తున్నాడు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామానికి చెందిన పత్తెం లక్ష్మీరాజం (60) మరో నిందితుడు. వీరిద్దరిపై సిరిసిల్ల టౌన్ పోలీస్స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అనారోగ్యం నయం చేస్తామని నమ్మించి..
పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మీరాజం తరచూ శ్యాం కుమార్ దుకాణానికి పూజా సామగ్రి కోసం వచ్చేవాడు. అమాయక ప్రజలను క్షుద్ర పూజలు, మంత్రాలు, చేతబడుల పేరుతో మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఆలోచనను లక్ష్మీరాజం శ్యాం కుమార్ ముందు ఉంచగా అతడు అంగీకరించాడు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్కు చెందిన బండారి లత అనే మహిళ శ్యాం కుమార్ దుకాణానికి వచ్చింది. తనకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆమె చెప్పడంతో, ఆమె నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న నిందితులు క్షుద్ర పూజలతో వ్యాధిని నయం చేస్తామని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు.
ఫిబ్రవరిలో ఆమెను సిరిసిల్ల పాత బస్స్టాండ్ వద్దకు పిలిపించి లక్ష్మీరాజానికి పరిచయం చేశారు. పూజల పేరుతో మొదట రూ.10 లక్షలు, అనంతరం యాదగిరిగుట్ట వద్ద రూ.21 లక్షలు, కాశీలో రూ.13 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా శ్యాం కుమార్ ఎస్బీఐ బ్యాంకు ఖాతాతో పాటు ఇతర ఖాతాల ద్వారా విడతలవారీగా దాదాపు రూ.62 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. మొత్తంగా కోటి రూపాయలకు పైగా మోసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
బ్లాక్మెయిల్, బెదిరింపులు
పులుతాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు నిందితులను నిలదీయడంతో.. భవిష్యత్లో బ్లాక్మెయిల్ చేసేందుకు తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా చేతబడి చేసి కుటుంబం మొత్తాన్ని చంపుతామని బెదిరించడంతో పాటు, ఆమె భూమిలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు.ఈ నెల 23న బాధితురాలిని సిరిసిల్లకు పిలిపించగా ఆమె అక్కడికి వెళ్లకుండా పోలీసులను ఆశ్రయించింది.
రూ.30.50 లక్షల నగదు స్వాధీనం
బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అగ్రహారం గ్రామంలోని లక్ష్మీరాజం ఇంటి వద్ద నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30.50 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు, బెల్లంతో తయారు చేసిన రెండు బొమ్మలు, పసుపు, కుంకుమతో పాటు పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. నిందితులను సమర్థవంతంగా పట్టుకున్న డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ గణేష్ తదితర పోలీసు సిబ్బందిని ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేకంగా అభినందించారు.
మూఢనమ్మకాలను నమ్మొద్దు: ఎస్పీ
అనారోగ్య సమస్యలకు క్షుద్ర పూజలు, చేతబడి, మంత్రాలు పరిష్కారం కాదని ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు అర్హత కలిగిన వైద్యులను సంప్రదించాలని సూచించారు. గుప్త నిధులు, మూఢనమ్మకాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, అలాంటి వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

