కలం, నిర్మల్ : తెలంగాణలో హోం మంత్రి లేకపోవడంతో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) ఆరోపించారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీ కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా నల్ల ఇంకు పోయడం ఏమిటని ప్రశ్నించారు. అసలు ఏ అంశంపై నిరసన చేపట్టారో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో హోం మంత్రి లేకుండానే పాలన సాగుతోందని, ఫలితంగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా భ్రష్టుపట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులపై లాఠీచార్జీలు, దాడులు జరుగుతున్నా కాంగ్రెస్ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. శంషాబాద్ లో నర్సుపై అత్యాచారం, హత్య ఘటనతో పాటు మైనర్ బాలికపై అత్యాచారం వంటి ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎదుర్కొంటున్న వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇతర పార్టీల కార్యాలయాలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసులు దాడులు చేసినా కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

