పెద్దపల్లి సీఎంఆర్‌లో రూ.12 కోట్ల భారీ స్కామ్?

కలం, కరీంనగర్ బ్యూరో: నిరుపేదల ఆకలి తీర్చేందుకు, రైతన్నలకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కస్టమ్ మిల్లింగ్ రైస్ వ్యవస్థ అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి (Peddapalli CMR Scam) జిల్లా పరిధిలో గత మూడేళ్లుగా సాగుతున్న రూ.12 కోట్ల విలువైన ధాన్యం రీ-సైక్లింగ్, ‘షాడో మిల్లింగ్’ దందా సంచలన ఆధారాలతో సహా బయటపడింది. కాగితాల్లో ఒక మిల్లు పేరిట ధాన్యం కేటాయింపులు చూపిస్తూ.. ఆచరణలో లారీలను దారి మళ్లించి మరో మిల్లు గోదాముల్లో ఖాళీ చేస్తున్న ఈ బహుళ కోట్ల స్కామ్ విజిల్ బ్లోయర్ అందించిన ట్రిప్ షీట్లు, రవాణా ఆధారాలతో బహిర్గతమైంది.

‘షాడో మిల్లింగ్’? ట్రిప్ షీట్ల సంతకాలే సాక్ష్యం

ప్రభుత్వ పౌరసరఫరాల సంస్థ నుంచి ‘పవనసుత రైస్ మిల్లు’ పేరిట మిల్లింగ్ నిమిత్తం సుమారు రూ.12 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని కేటాయించారు. అయితే ఈ ధాన్యం అసలు పవనసుత మిల్లు ప్రాంగణంలోకి అడుగుపెట్టనే లేదు. కొనుగోలు కేంద్రాల నుంచి బయలుదేరిన ధాన్యం లారీలు రాత్రికి రాత్రే సూరయపల్లిలోని ‘శ్రీలక్ష్మి రైస్ మిల్లు’కు అక్రమంగా తరలించారు. శ్రీలక్ష్మి మిల్లులో వోల్లాటి నవీన్ కుమార్ అనే వ్యక్తి స్వయంగా ఈ ప్రభుత్వ ధాన్యం లారీలను దిగుమతి చేసుకుని, రవాణా పత్రాలైన ట్రిప్ షీట్లపై సంతకాలు చేశారు.

లభించిన ఆధారాలు

ప్రస్తుతం ప్రాథమికంగా లభించిన 10కి పైగా ఒరిజినల్ ట్రిప్ షీట్లు ఈ అక్రమాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం రవాణాలో ప్రతి అడుగూ పారదర్శకంగా ఉండాలి. కానీ, అధికారులు, వ్యాపారుల అపవిత్ర కలయికతో ఆధునిక సాంకేతిక వ్యవస్థలు నామమాత్రంగా మారాయి. ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి బయలుదేరే ప్రతి లారీకి వాహన ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. రూట్ డైవర్షన్ అయినట్లు ఆన్ ద రికార్డ్ నమోదవుతున్నప్పటికీ, ఏ ఒక్క అధికారీ అలర్ట్ సిస్టమ్‌ను పర్యవేక్షించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. డిజిటల్ వే-బిల్లులలో కేటాయించిన మిల్లు ఒకటైతే, అన్‌లోడింగ్ సమయంలో రిసీవర్ సంతకం మరొకరిది ఉంటోంది. సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్, ఇన్‌స్పెక్టర్లు ప్రతి నెలా మిల్లుల్లో స్టాక్ సరి చూసుకోవాల్సి ఉండగా, 2021 నుంచి లెక్కల్లో ఉన్న ధాన్యం గోదాముల్లో లేకపోయినా “స్టాక్ సరిగ్గా ఉంది” అని నివేదికలు ఇవ్వడం వెనుక భారీ స్థాయిలో ‘మామూళ్లు’ మారాయనే ఆరోపణలు ఉన్నాయి.

‘మాఫియాతో ప్రతినెల ప్యాకేజీలు’?

2021 నుంచి నిరంతరాయంగా సాగుతున్న ఈ అక్రమ దందా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల కనుసన్నల్లోనే  జరిగిందనడంలో సందేహం లేదు. ధాన్యం రీ-సైక్లింగ్ ద్వారా కాగితాలపై మాత్రమే మిల్లింగ్ పూర్తయినట్లు చూపి, సబ్సిడీ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారు. ఇది కేవలం ఒక ప్రాంతీయ అక్రమం కాదు; వ్యవస్థీకృత ఆర్థిక నేరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే క్రింది చర్యలు తీసుకోవాల్సి ఉంది. మనీ లాండరింగ్, బినామీ మిల్లింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీసీఐడీ, విజిలెన్స్ శాఖలతో సంయుక్త విచారణ జరిపించాలని స్థానికంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రజాధనం రూ.12 కోట్లు రికవరీ చేయడానికి సూత్రధారి వోల్లాటి నవీన్ కుమార్, ‘పవనసుత’, ‘శ్రీలక్ష్మి’ రైస్ మిల్లుల యజమానుల స్థిర, చరాస్తులను చట్టప్రకారం స్వాధీనం చేసుకోవాలని, 2021 నుంచి ఇప్పటివరకు జిల్లా పరిధిలో పనిచేసిన పౌరసరఫరాల శాఖ అధికారులు, తనిఖీ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిని సస్పెండ్ చేయాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>