కలం, నిర్మల్ : తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు స్పష్టం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె(NHM Employees Strike) సోమవారానికి 28వ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా సమ్మె శిబిరంలో ఉద్యోగులు లక్ష్మీ పూజలు(Lakshmi Puja) నిర్వహించి దీపాలు వెలిగించారు. అనంతరం ఉద్యోగులు మాట్లాడుతూ.. నెల రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. విధులు నిర్వహించాల్సిన తాము రోడ్లపైనే పూజలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

