కలం, నిజామాబాద్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో జరిగిన ఉద్యోగ నియామకాల విషయాల్లో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. టైం, ప్లేస్ డిసైడ్ చేసుకోవాలని సవాల్ విసిరారు. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న వినాయకుడి ఆలయంలో పూజలు చేసిన అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల కల్పనలో గులాబీ పార్టీ నేతలవి పసలేని ఆరోపణలు చేస్తున్నారని.. సవాళ్లు విసిరి తోక ముడిచారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలతో సహా 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు రికార్డులు ఉన్నాయని చెప్పారు.
కాంట్రాక్టుల జేబులు నింపి..
నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ హయంలో నీళ్ల, నిధుల దోపిడీ తప్ప మరేమీ లేవన్నారు. కాళేశ్వరం బీటలు వారిందని… ఆ ప్రాజెక్టుతో కాంట్రాక్టుల జేబులు నింపారని విమర్శించారు. నీటి విడుదల అనేది నిపుణుల సలహాలు, సూచన మేరకే ఉంటుందన్నారు. బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలు ఆదరించే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు.

