కలం, స్పోర్ట్స్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచకప్ విజేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆరోగ్యం, ఆయన జైలు పరిస్థితులపై మరోసారి వివాదం రాజేసింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్.. ఇమ్రాన్ కుమారులు సులైమాన్, ఖాసిమ్‌లతో నిర్వహించిన ఇంటర్వ్యూ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇంగ్లండ్-పాకిస్థాన్ లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ తొలి రోజు లంచ్ విరామంలో ఈ ఇంటర్వ్యూను స్లై స్పోర్ట్స్ ప్రసారం చేసింది. దీన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తీవ్రంగా నిరసించింది. ఒకానొక దశలో పాకిస్థాన్ జట్టు మైదానంలోకి వెళ్లకుండా నిరసన తెలపాలని భావించినా, చివరికి చర్చలతో ఆ ఆలోచనను విరమించుకుంది.
ఇక పాకిస్థాన్ ప్రభుత్వ ఛానెల్ PTV ఈ ఇంటర్వ్యూ ప్రసారం కాకుండా ప్రకటనలు వేసింది. ఈ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ కుమారులు తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 నుంచి జైలులోనే ఉన్న తమ తండ్రిని అధికారులు కావాలనే ఒంటరిని చేసి, ప్రాణాలు తీసేందుకు యత్నిస్తున్నారని ఖాసిమ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇమ్రాన్‌కు ఒక కంటి చూపు 80 శాతం తగ్గిపోయిందని, రోజుకు 23 గంటలకు పైగా చిన్న గదిలోనే ఉంచుతున్నారని చెప్పాడు. కనీసం పుస్తకాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇమ్రాన్ (Imran Khan)ను షిఫా ఇంటర్నేషనల్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. అయితే, మొదట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి కొద్దిసేపటికే మళ్లీ జైలుకు తరలించారని సులైమాన్ వివరించాడు. తర్వాత ఆగస్టు 21న ఆయనను షిఫా ఆసుపత్రిలో పరీక్షించి తిరిగి అడియాలా జైలుకు పంపారు. ఈ పరిణామాలపై మాజీ క్రికెటర్లు సైతం స్పందించారు. భారత దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్‌లతో పాటు పలువురు అంతర్జాతీయ మాజీ కెప్టెన్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు లేఖ రాశారు.
ఇమ్రాన్‌కు సరైన వైద్యం, మెరుగైన సౌకర్యాలు అందించాలని మానవీయ కోణంలో విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోయిన తర్వాత నుంచి అనేక చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు. తోషాఖానా, ఇద్దత్ కేసులు, 2025 జనవరి 17న అల్-కాదిర్ ట్రస్ట్ కేసులో లభించిన 14 ఏళ్ల జైలు శిక్షతో సహా ఆయనపై 100కు పైగా కేసులు నమోదయ్యాయి.
Also Read : దులీప్ ట్రోఫీ: 15 ఏళ్ల వైభవ్ DRS మాస్టర్ మైండ్!
Follow Us On: X(Twitter)

