కలం, కరీంనగర్: ఢిల్లీలో కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (Telangana Rajyadhikara Party) కరీంనగర్ (Karimnagar) జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మహిళా అధ్యక్షురాలు రాచురి అరుణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ అఖిల్ పాషా మాట్లాడుతూ, కాక్రోజ్ జనతా పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, నిర్లక్ష్యం కారణంగా దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నీట్ వ్యవహారంలో నష్టపోయిన ప్రతి విద్యార్థి కుటుంబానికి రూ.1 కోటి నష్టపరిహారం అందించాలని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేశారు.
విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయడం, పరీక్షల నిర్వహణలో బాధ్యతారాహిత్యం ప్రదర్శించడం క్షమించరాని విషయమని అఖిల్ పాషా పేర్కొన్నారు. విద్యను కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి అప్పగించే విధానాలను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పిల్లల భవిష్యత్తు రక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రజల హక్కులు, విద్యార్థుల భవిష్యత్తు, సామాజిక న్యాయం కోసం జరిగే ప్రతి ఉద్యమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలుస్తుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా, ప్రధాన కార్యదర్శి చిగుర్ల మోహన్, కార్యదర్శి దాట్ల శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు రాచురి అరుణ దేవి, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ వాజిద్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీకాంత్, టౌన్ ప్రధాన కార్యదర్శి ఎగుర్ల రమేష్, మండలాల అధ్యక్షులు శువరాత్రి మోహన్, ఓర్సు రాజు, ఓర్సు విమలతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

