కలం, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు శనివారం సర్జరీ జరిగింది. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనపరమైన విషయాలపై చర్చిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వ్యక్తిగత వైద్యుల సూచనలతో ఆసుపత్రికి వెళ్లిన ఆయన పలు పరీక్షలు, ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయించుకున్నారు. పరీక్షలు పరిశీలించిన వైద్యులు ఆయనకు సర్జరీ చేయించుకోవాలని సూచించారు. దీంతో ఆయనకు శనివారం వైద్యులు సర్జరీ చేశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగానే ఉందని, వారం నుంచి 10 రోజుల విశ్రాంతి తర్వాతే కార్యక్రమాల్లో పాల్గొనాలని డాక్టర్లు సూచించినట్లు వెల్లడించింది. అయితే ఆయనకు ఏ సర్జరీ జరిగిందనే విషయాన్ని పార్టీ స్పష్టత ఇవ్వలేదు.
ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని రాజకీయ పార్టీల నేతలు, కూటమి కార్యకర్తలు, ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ”సర్జరీ చేయించుకున్న పవనాన్న త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా. నిత్యం రాష్ట్రాభివృద్ధి – ప్రజా సంక్షేమమే ఆశగా, శ్వాసగా పనిచేసే మీరు త్వరలో ఆరోగ్యవంతులై ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నా. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోండి పవనాన్న” అంటూ ట్వీట్ చేశారు.

