‘మహాత్మా’.. గోడు వినేదెవరూ..? ఎంజీయూలో పూటకో సమస్య!

కలం, నల్లగొండ బ్యూరో : అభివృద్ధి పనుల్లో కోట్లు కుమ్మరిస్తున్నా.. ఆకలి తీర్చే అన్నంలో మాత్రం నాణ్యత కరువయింది. వసతి గృహాల్లో సౌకర్యాల లేమి.. పాలనలో పారదర్శకత లోపం.. ఇదీ నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ (Mahatma Gandhi University) నేటి దుస్థితి. ఈసీ (పాలకమండలి) గడువు ముగిసి రెండేండ్లు దాటినా.. కొత్త కమిటీ నియామకంలో ప్రభుత్వం చూపుతున్న తాత్సారం ఎవరికి లాభం చేకూరుస్తోంది? అసలు వర్సిటీ బాగుపడాలనే సంకల్పం అధికారుల్లో ఉందా..? అన్న అనుమానాలు లేకపోలేదు. మరోవైపు పాలకమండలి పర్యవేక్షణ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు చక్రం తిప్పుతుంటే, హాస్టల్ గదుల్లో విద్యార్థులు కనీస వసతులు లేక నరకం చూస్తున్నారు. నల్లగొండ నడిబొడ్డున వెలసిన విద్యాకుసుమం.. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (Mahatma Gandhi University). వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఈ అక్షర దేవాలయం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. విద్యార్థుల కళ్లలో ఆశలు ఆవిరవుతుంటే.. ఉద్యోగుల గుండెల్లో అనిశ్చితి రాజ్యమేలుతోంది.

పాలకమండలి లేకపోవడంతో గాడి పాలన..

ఏ విశ్వవిద్యాలయానికైనా పాలకమండలి వెన్నెముక వంటిది. నిధుల కేటాయింపు, కీలక నిర్ణయాలు, నియామకాలు అన్నీ ఈ మండలి పర్యవేక్షణలోనే జరగాలి. కానీ, ఎంజీయూలో ఈసీ గడువు ముగిసి రెండేళ్లు దాటినా, కొత్త కమిటీ ఊసే లేదు. పర్యవేక్షించే వారు లేకపోవడంతో వర్సిటీలో అధికారుల నిర్ణయాలు శాసనాలుగా మారుతున్నాయి. అడిగే వారు లేరనే ధీమాతో కొన్ని నిర్ణయాలు ఏకపక్షంగా సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కీలకమైన పనులు, విద్యార్థి ప్రయోజనాలకు సంబంధించిన ఫైళ్లు ఈసీ ఆమోదం లేక అటకెక్కాయి. వర్సిటీలో విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. వసతి గృహాల్లో తాగునీరు, పరిశుభ్రత, నాణ్యమైన భోజనం వంటి కనీస అవసరాల కోసం విద్యార్థులు నేటికీ పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం విద్యార్థులే కాదు.. వర్సిటీ నమ్మకంతో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు.

జీఎస్టీ స్కామ్.. ఆహారంలో గుట్కా ప్యాకెట్లు..

యూనివర్సిటీలో సుమారు 113 మంది ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి గతంలో పనిచేసిన ఒక ఏజెన్సీ నిర్వాహకుడు భారీగా పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు ఏజెన్సీ నిర్వాహకుడు గత రెండేళ్లుగా కేంద్ర పన్నుల శాఖకు చెల్లించాల్సిన సుమారు 99 లక్షల రూపాయల జీఎస్టీని చెల్లించకుండా కాలయాపన చేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని జీఎస్టీ అధికారులు గుర్తించి ఏజెన్సీకి నోటీసులు జారీ చేయడంతో ఈ స్కామ్ బయటపడింది. ఏజెన్సీ తన బాధ్యతను విస్మరించి, ప్రభుత్వం నుంచి పొందిన నిధులను పన్ను రూపంలో చెల్లించలేదని తేలింది. ఈ అక్రమాల నేపథ్యంలో వర్సిటీ అధికారులు సదరు ఏజెన్సీకి బిల్లుల చెల్లింపును నిలిపివేశారు. దీనివల్ల మధ్యలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందక ఇబ్బంది పడ్డారు. మరోవైపు ఫిబ్రవరి నెలలో వర్సిటీ హాస్టల్ మెస్‌లో వడ్డించిన జీరా రైస్‌లో గుట్కా ప్యాకెట్లు రావడం వర్సిటీలో పెద్ద దుమారం రేపింది. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు ప్లేట్లతో సహా మెయిన్ గేటు ముందు ధర్నాకు దిగారు. అంతకుముందు కూడా ఆహారంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆరోపించారు. వర్సిటీ అధికారులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఇలాంటి వెలుగులోకి రాని ఘటనలు వర్సిటీలో కొకొల్లలు.

అభివృద్ధి పనుల మాటున అవినీతి..?

ఒకవైపు పాలన కుంటుపడుతున్నా.. మరోవైపు వర్సిటీలో సివిల్ పనులు మాత్రం జోరుగా సాగుతున్నాయి. అయితే, ఈ పనుల వెనుక భారీ ఎత్తున అవినీతి జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలకమండలి ఉంటే పనులపై నిఘా ఉంటుంది. ప్రశ్నించే గొంతులు ఉంటాయి. అందుకే కావాలనే ఈసీ నియామకాన్ని కాలయాపన చేస్తున్నారా? అన్నది ఇప్పుడు సగటు విద్యార్థి అనుమానం. మహాత్మా గాంధీ పేరు మీద వెలసిన ఈ సంస్థలో పారదర్శకత మచ్చుకైనా కనిపించడం లేదు. పాలకమండలి లేకపోవడం వల్ల వర్సిటీ ప్రతిష్ట మసకబారుతోంది. విద్యా సంవత్సరం గడుస్తున్నా కొద్దీ పెండింగ్ సమస్యల భారంతో ఎంజీయూ చతికిలబడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి ఇప్పటికైనా స్పందించాలి. రాజకీయాలకు అతీతంగా, తక్షణమే పూర్తిస్థాయి పాలకమండలిని నియమించి ఎంజీయూను సమస్యల ఊబి నుండి కాపాడాలి. లేదంటే పేద విద్యార్థుల ఉన్నత చదువుల కలలు కలలుగానే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>