కలం, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జన్మదిన వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో అమలాపురంలో ఓ అభిమాని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించినట్లు జనసేన పార్టీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. మృతుడు ప్రేమ్‌కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ కల్యాణ్ ప్రార్థించారు. అతడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తన అభిమానులకు కీలక సందేశాన్ని అందించారు. జీవితం ఎంతో విలువైందని, యువత వేడుకలు, ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో తమకు ఓ కుటుంబం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో ర్యాలీలలో తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.

