కలం, స్పోర్ట్స్: విశ్వనాథన్ ఆనంద్‌కు (Viswanathan Anand) ఇప్పుడు రెండు కీలక బాధ్యతలు. ఒకవైపు ప్రపంచ చెస్ సమాఖ్య ఎఫ్ఐడీఈను నడిపిస్తున్నారు. మరోవైపు గ్లోబల్ చెస్ లీగ్‌లో టైటిల్ కోసం సిద్ధమవుతున్నారు. జూలై 24న ఆనంద్ ఎఫ్ఐడీఈ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు ఆయన డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఎఫ్ఐడీఈ అధ్యక్షుడు ఆర్కాడీ ద్వోర్కోవిచ్‌పై ఆంక్షలు రావడంతో ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఆనంద్‌కు తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు వచ్చాయి. ఆయన పదవీకాలం సెప్టెంబర్ 26న జరిగే ఎఫ్ఐడీఈ అధ్యక్ష ఎన్నికలతో ముగియనుంది.
ప్రపంచ చెస్ సమాఖ్య ఎఫ్ఐడీఈ బాధ్యతలతో గ్లోబల్ చెస్ లీగ్ టైటిల్ కోసం సిద్ధమవుతుండటం ఒత్తిడితో కూడుకున్నదన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎఫ్ఐడీఈ సమావేశాల్లో ఎక్కువగా పాల్గొంటున్నట్టు చెప్పారు. భారత్ నుంచే అనేక సుదీర్ఘ జూమ్ సమావేశాల్లో పాల్గొంటున్నట్టు వివరించారు. అయితే ఇప్పుడు ఎఫ్ఐడీఈ పనుల ఒత్తిడి కొంత తగ్గిందని ఆనంద్ చెప్పారు. జనరల్ అసెంబ్లీకి సంబంధించిన అజెండా సిద్ధమవడంతో సమావేశాలు కాస్త తగ్గాయని తెలిపారు.
ఇదే సమయంలో ఆనంద్ దృష్టి గ్లోబల్ చెస్ లీగ్‌పై పడింది. ఈ ఏడాది ఆయన అలాస్కన్ నైట్స్ తరఫున ఆడనున్నారు. గత మూడు సీజన్లలో గ్యాంగెస్ గ్రాండ్‌మాస్టర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆయనకు ఇది కొత్త జట్టు. అయినా టైటిల్ గెలవాలన్న ఆకలి తగ్గలేదని స్పష్టం చేశారు. జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కొత్త జట్టులో ఉన్నా పెద్దగా ఇబ్బంది ఉండదని ఆనంద్ భావిస్తున్నారు. గతంలో అర్జున్ ఎరిగైసితో కలిసి ఆడిన అనుభవం ఉందని తెలిపారు. అందువల్ల సహచరులను కలిసిన వెంటనే పరిస్థితి సాధారణంగా మారుతుందని చెప్పారు.
ఎఫ్ఐడీఈ బాధ్యతలు ఉన్నప్పటికీ GCL సమయంలో ఆటపైనే ప్రధానంగా దృష్టి పెడతానని ఆనంద్ తెలిపారు. అత్యవసరమైన ఎఫ్ఐడీఈ విషయం వస్తే వెంటనే నిర్ణయం తీసుకుంటానని, లేకపోతే ఎక్కువ సమయం సమావేశాలకు కేటాయించబోనని చెప్పారు. బెంగళూరులో సెప్టెంబర్ 5 నుంచి 13 వరకు గ్లోబల్ చెస్ లీగ్ జరగనుంది. ఈ పోటీలు అత్యంత పోటీగా ఉంటాయని ఆనంద్ అభిప్రాయపడ్డారు. వేగవంతమైన టైమ్ కంట్రోల్, జట్టు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆటగాళ్లు తమ వ్యూహాలను మార్చుకుంటారని తెలిపారు. తాత్కాలికంగా ఎఫ్ఐడీఈ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆనంద్.. ఇప్పుడు మరోసారి చెస్ బోర్డుపై తన సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

