కలం, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్‌లో 500 రోజులకు పైగా జైలులో ఉన్న ఇస్కాన్ మఠాధికారి చిన్మయ కృష్ణ దాస్ (Chinmoy Krishna Das) విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మళ్లీ బెయిల్ నిరాకరించబడిందని పేర్కొంటూ ఈ ఘటనపై ప్రపంచం మౌనంగా ఉండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, చిన్మయ కృష్ణ దాస్ ప్రభు జైలులోనే కొనసాగుతుండగా ఆయన న్యాయవాదులపై కూడా బెదిరింపులు, ఒత్తిడులు ఉన్నాయని ఆరోపించారు. కోర్టు పరిసరాలలో కూడా వారికి స్వేచ్ఛగా వాదనలు వినిపించే పరిస్థితి లేదని తెలిపారు.
మత స్వేచ్ఛ, మైనారిటీ హిందూ సమాజ హక్కుల కోసం మాట్లాడటం నేరమా? అని ఆయన ప్రశ్నించారు. సన్యాసి వేషధారణలో ఉన్న వ్యక్తిని కూడా క్రిమినల్‌లా చూడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. చిన్మయ కృష్ణ దాస్‌కు తక్షణ వైద్య సహాయం అందించాలని, అలాగే న్యాయమైన విచారణకు అవకాశం కల్పించాలని పవన్ కల్యాణ్ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. వీలైనంత త్వరగా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయంగా మానవ హక్కుల అంశాలపై స్పందించే కొన్ని వర్గాలు ఈ విషయంలో మౌనంగా ఉండటంపై కూడా ఆయన విమర్శలు చేశారు.

