Mobile Popup Ad
Mobile Popup Ad

ఎన్టీఏకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అక్షింతలు

కలం, ఢిల్లీ బ్యూరో : జేఈఈ, నీట్ లాంటి పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్లక్ష్యాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తప్పుపట్టింది. రెండేండ్ల కిందటే డాక్టర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో హై లెవల్ కమిటీ ఏర్పడినా, కొన్ని సిఫారసులు చేసినా వాటిని ఎందుకు అమలు చేయడంలేదని నిలదీసింది. పరీక్షల నిర్వహణలో తరచూ లోపాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించింది. ఇప్పటికైనా ఆ కమిటీ సిఫారసులను అమలు చేయాలని, పరీక్షల నిర్వహణకు సంబంధించి టైమ్-బౌండ్ రోడ్ మ్యాప్ తయారుచేయాలని గత వారం సమర్పించిన రిపోర్టులో స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది. వివిధ కోర్సుల్లో చేరేందుకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల్లో తలెత్తుతున్న లోపాలతో ఎన్టీఏ విశ్వసనీయతను కోల్పోయిందని వ్యాఖ్యానించింది. ఉదాహరణకు 2024 సంవత్సరంలో ఎన్టీఏ 14 పోటీ పరీక్షలను నిర్వహిస్తే అందులో ఐదు వివిధ కారణాలతో సమస్యలు ఎదుర్కొన్నాయని ఎత్తిచూపింది. తాజాగా నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష సైతం డైలమాలో పడిందని గుర్తుచేసింది.

ఎన్టీఏ నిర్వహణ పటిష్టం కాకుంటే నష్టమే :

పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ తన తప్పిదాలను, లోపాలను సమీక్షించుకుని అధిగమించకపోతే విద్యార్థుల, అభ్యర్థుల నమ్మకాన్ని చూరగొనడం కష్టమేనని సీనియర్ పార్లమెంటేరియన్ దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హెచ్చరించింది. ఎన్టీఏ 2024లో నిర్వహించిన యూజీసీ-నెట్, సీఎస్ఐఆర్-నెట్, నీట్-పీజీ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చిందని, నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ అయిందని, సీయూఈడీ (యూజీ/పీజీ) ఫలితాల వెల్లడిని వాయిదా వేయాల్సి వచ్చిందని కమిటీ గుర్తుచేసింది. గతేడాది జనవరిలో నిర్వహించిన జేఈఈ-మెయిన్స్ పరీక్షలో 12 ప్రశ్నలను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నది. పరీక్షల నిర్వహణలో ఇన్ని లోపాలుంటే విద్యార్థులకు, అభ్యర్థులకు నమ్మకం ఎలా ఏర్పడుతుందని ప్రశ్నించింది. ఇన్ని నిర్వాకాలు చోటు చేసుకున్నందున ఎన్టీఏ వీలైనంత తొందరగా నిర్వహణలోని లోపాలను సమీక్షించుకుని విధానాన్ని ప్రక్షాళన చేయాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో రిపీట్ కాకు,డా చూసుకోవాల్సిన బాధ్యత ఆ సంస్థదేనని పేర్కొన్నది.

బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీలకు మళ్ళీ బాధ్యతలా? :

ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల రూపకల్పన మొదలు నిర్వహణలో, జవాబు పత్రాలను దిద్దడం, ఫలితాలను వెల్లడించడం వరకు అనేక ప్రైవేటు సంస్థల భాగస్వాములుగా ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ ప్రస్తావించింది. ఒక సంస్థ లేదా ఒక రాష్ట్రం బ్లాక్ లిస్ట్ చేసిన తర్వాత ఆ ప్రైవేటు కంపెనీని తిరిగి ఎన్టీఏ ఎలా నియమించుకుంటుందని ప్రశ్నించింది. ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీలను ఎన్టీఏ ఏ రూపంలోనూ ఎంగేజ్ చేసుకోకూడదని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల నుంచి బ్లాక్ లిస్టెడ్ ప్రైవేటు కంపెనీల జాబితా తెప్పించుకుని జాతీయ స్థాయిలోనే ఒక జాబితాను రూపొందించాలని ఆదేశించింది. బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీలకు చెందిన వ్యక్తులు కొత్త సంస్థలతో ముందుకొచ్చినా వాటిని కూడా ఎన్టీఏ ఏ రూపంలోనూ దగ్గరకు రానివ్వకూడదని పేర్కొన్నది. గడచిన ఆరేండ్లలో ఎన్టీఏ నిర్వహించిన ప్రవేశ పరీక్షల ద్వారా అభ్యర్థుల నుంచి రూ. 3,513 కోట్లను ఆర్జించిందని, పరీక్షల నిర్వహణ కోసం రూ. 3,065 కోట్లను ఖర్చు పెట్టిందని, ఇంకా దాని దగ్గర రూ. 448 కోట్లు ఉన్నాయని కమిటీ వివరించింది. పరీక్షల నిర్వహణలో ఇలాంటి లోపాలు తలెత్తకుండా ఈ మిగులు డబ్బును ఎన్టీఏ తన సంస్థాగత వ్యవహారాలను పటిష్టం చేసుకునే అవసరాలకు ఖర్చు చేస్తే ప్రయోజనం ఉంటుందని సూచించింది.

రాధాకృష్ణన్ కమిటీ సిఫారసుల అమలు తప్పదు :

పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ వైఫల్యాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రెండేండ్ల క్రితం ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో హై-లెవెల్ కమిటీ ఏర్పడిందని గుర్తుచేసిన పార్లమెంటరీ కమిటీ అది సూచించిన సిఫారసులను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కేవలం ఆడిట్ రిపోర్టును తయారుచేయడానికే ఎన్టీఏ పరిమితమైందని, ఇక నుంచి ప్రతీ ఏటా వార్షిక నివేదికను సైతం రూపొందించాలని హైలెవల్ కమిటీ తన సిఫారసుల్లో పేర్కొన్నది. అది చేసిన కొన్న

సిఫారసులు ఇవీ :

• ఎన్టీఏ ఇక నుంచి ప్రతీ ఏటా వార్షిక నివేదికను తయారు చేయాలి. దీన్ని క్రమం తప్పకుండా పార్లమెంటుకు సమర్పించాలి.
• వివిధ కారణాలతో పరీక్షల నిర్వహణలో లోపాలు, ఫలితాల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యంతో విద్యార్థులు, అభ్యర్థులు తీవ్రమైన మానసిక క్షోభను ఎదుర్కొంటున్నారని, వాటిని నివారించే విధానాన్ని రూపొందించుకోవాలి.
• పోటీ పరీక్షల కోసం అనేక ప్రైవేటు కోచింగ్ సెంటర్లు పుట్టుకొస్తున్నందున వీటిని నియంత్రించేందుకు నిర్దిష్ట విధానాన్ని రూపొందించేలా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి.
• ప్రశ్నాపత్రాలు కేవలం తరగతి సిలబస్‌ ఆధారంగానే రూపొందాలి. ప్రైవేటు కోచింగ్ సెంటర్లు రూపొందిస్తున్న సమాంతర సిలబస్‌ ప్రభావం కనిపించకూడదు.
• పెన్-పేపర్ సిస్టమ్‌లో జరిగే పరీక్షల్లో అవకతవకలు జరిగే అవకాశాలు ఎక్కువ. కంప్యూటర్ ఆధారితం జరిగే పరీక్షల్లో హ్యాకింగ్ జరిగే అవకాశాలున్నాయి. ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండే విధానాన్ని ఎంచుకోవాలి. సీబీఎస్ఈ, యూపీఎస్సీ పరీక్షలు ఈ మిశ్రమ పద్ధతిలోనే జరుగుతున్నాయి. లీక్ జరిగిన ఘటనలు లేవు.
• ఒకవేళ కంప్యూటర్ ఆధారిత పరీక్షల విధానాన్నే ఎన్టీఏ ఎంచుకుంటే తప్పినసరిగా ప్రభుత్వ, ప్రభుత్వ నియంత్రణలో ఉండే సెంటర్లలో మాత్రమే ఎగ్జామ్స్ జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు సెంటర్లను నివారించాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>