Mobile Popup Ad
Mobile Popup Ad

పిల్లలు అడిగిందల్లా కొనిస్తున్నారా? అయితే ఈ నష్టాలు తప్పవు!

కలం, వెబ్‌డెస్క్: పూర్వ కాలంతో పోలిస్తే నేటి ఆధునిక కాలంలో తల్లిదండ్రుల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఈ కాలపు తల్లిదండ్రులు తమ పిల్లలు ఏది అడిగినా నిమిషం కూడా ఆలోచించకుండా ఇట్టే కొనిపెడుతున్నారు. దీనికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకు.. బిజీగా ఉండి పిల్లలతో సమయం గడపలేనివారు కొందరైతే, నేను చిన్నప్పుడు పడ్డ కష్టాలు నా పిల్లలు పడొద్దు అనే ఆలోచన కలిగిన వారు మరికొందరు. వీరు తమ పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నాం అనే అపరాధ భావనతో వారు అడిగిందల్లా కొనిస్తుంటారు. పిల్లలపై ఉన్న అతి ప్రేమే దీనికి కారణం కావచ్చు. కానీ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రలు ఇలాంటి తప్పులు (Parenting Mistakes) చేయడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. దీని వల్ల కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పిల్లల్లో ఓర్పు తగ్గిపోవడం

అడిగిన వెంటనే ప్రతీది కొనివ్వడం వలన పిల్లల్లో ఓర్పు తగ్గిపోతుందని చెబుతున్నారు. ఎప్పుడైనా కొనివ్వలేని సందర్భాలు వచ్చినప్పుడు పిల్లలు అర్థం చేసుకోలేరు. అడిగిన ప్రతి వస్తువు వెంటనే దొరకాలని భావిస్తారు. దీని ఫలితంగా చిన్న విషయాల్లో కూడా అసహనం, కోపం పెరిగే అవకాశం ఉంటుందట. అందుకే పిల్లలకు ఓర్పు నేర్పడం చాలా అవసరం. జీవితంలో ప్రతిసారి మనకు అనుకూల పరిస్థితులు ఉండవు కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకు ఓర్పుగా ఉండటం నేర్పించాలి.

2. కష్టపడే విలువ తెలియదు

ఎటువంటి ప్రయత్నమూ లేకుండా అడిగినవన్నీ చేతికి దొరికిపోతే, పిల్లల్లో శ్రమ పట్ల గౌరవం ఉండదు. ఒక వస్తువును సంపాదించడం వెనుక తల్లిదండ్రులు పడే శ్రమ, సమయం, ఆర్థిక ఇబ్బందులు పిల్లలకు అర్థం కావు. అన్నీ ఉచితంగా, సులభంగా వస్తాయనే భ్రమలో బతుకుతారు. ఏదైనా సాధించాలంటే శ్రమ, క్రమశిక్షణ, బాధ్యత అవసరమనే విషయాన్ని పిల్లలు గ్రహించలేరు. దీంతో బాధ్యతల నుంచి తప్పించుకోవాలనే ధోరణి పెరగవచ్చని చెబుతున్నారు నిపుణులు.

3. స్వార్థపూరిత ఆలోచనలు

పిల్లలు కోరిన ప్రతి వస్తువును చేతిలో పెట్టడం వల్ల వారు తామే సర్వస్వం అని భావించే ప్రమాదం ఉంది. తమ అవసరాలే ముఖ్యం అని కూడా భావిస్తారు. దీనివల్ల ఇతరుల అవసరాలు, ఇబ్బందులను అర్థం చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. ఫలితంగా పిల్లల్లో మొండితనం, స్వార్థపూరిత ప్రవర్తన కూడా పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

4. వస్తువుల విలువ తెలియదు

ఏ వస్తువు అయినా సులభంగా దొరికితే దాని విలువ తెలియదు. పిల్లలకు అడిగిన ప్రతిసారి కొత్త వస్తువులు కొనివ్వడం వలన వాటి ప్రాముఖ్యాన్ని వారు అర్థం చేసుకోలేరు. ప్రతి సారి కొత్త వస్తువే కావాలని కోరుకుంటారు. ఉన్నదానితో సంతృప్తి చెందడం అనే భావనను పిల్లలకు నేర్పించడం చాలా ముఖ్యం.

సమతుల్యమైన పెంపకమే ఉత్తమం

పిల్లలపై ప్రేమ ఉండటం సహజం, కానీ ఆ ప్రేమే వారి భవిష్యత్తుకు శాపంగా మారకూడదు. అందుకే పిల్లల ప్రతి కోరికను గుడ్డిగా తీర్చడం కంటే, ఏది మంచి ఏది చెడు అని అర్థం చేసుకునేలా వారిని తీర్చిదిద్దడమే నిజమైన పెంపకం అని మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైనప్పుడు ‘నో’ అని చెప్పడం, ఎదురు చూడటం, కష్టపడటం, బాధ్యతలను నిర్వర్తించడం వంటి విలువలను నేర్పించడం వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ప్రేమతో కూడిన క్రమశిక్షణ, సరైన హద్దులు పెట్టడం మంచి పెంపకానికి ప్రధాన లక్షణాలు అని నిపుణులు చెబుతున్నారు. పేరెంట్స్ తెలుసుకున్నారు కదా!.. ఇకనుంచి మీ పిల్లలు ఏదైనా అడిగితే.. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>