కలం, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో గురువారం నుంచి చేపట్టనున్న ‘సర్’ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ కేడర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. “ఓటర్ కార్డు లేకపోతే భవిష్యత్తులో రేషన్ కార్డు, ఆధార్ కార్డు పోతుంది. ప్రజలకు అన్యాయం జరగనివ్వొద్దు.
ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం కోసం బీజేపీ చేస్తున్న కుట్రలను నిశితంగా పరిశీలిస్తూ తిప్పికొట్టాలి” అని పిలుపునిచ్చారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ ప్రెసిడెంట్లు, జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, నియోజకవర్గాల ఇన్చార్జులతో బుధవారం జూమ్ మీటింగ్‌లో సీఎం మాట్లాడారు. ‘సర్’ విషయంలో మనం అప్రమత్తంగా ఉండకపోతే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అది భవిష్యత్తులో అనేక అనర్ధాలకు దారితీస్తుంది. ‘సర్’ విషయంలో ఇన్చార్జి మంత్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని సూచించారు.
ఎమ్మెల్యేలపై ఆగ్రహం..
‘సర్’ విషయంలో నిర్లక్ష్యం జరిగితే ఎవరినీ ఉపేక్షించబోమని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సీరియస్‌గా లేని పలువురు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని, పార్టీ ఆదేశాలను ఏ స్థాయివారైనా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘సర్’ పేరుతో బీజేపీ కుట్ర చేస్తున్నది. అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే ఉంటూ మానిటరింగ్ చేయాలి.
నాకూ ఒక నియోజకవర్గాన్ని కేటాయిస్తే, వెళ్లి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అధినాయకత్వం అప్పజెప్పిన పని చేయకుండా పార్టీకి నష్టం కల్గిస్తామంటే చూస్తు ఊరుకునేది లేదు. పది రోజుల సమయం ఇచ్చి చూస్తాం.. మారితే సరి.. లేదంటే వారిపై చర్యలు తప్పవు..” అని హెచ్చరించారు. పార్టీ సర్పంచులతో ‘సర్’పై గ్రామాల్లో ప్రచారం చేయించి అవగాహన కల్పించాలని సూచించారు.
ఓటు హక్కు.. ఆక్సిజన్: మీనాక్షి
ఓటు హక్కు కోసం దేశ చరిత్రలో పెద్ద పోరాటమే జరిగిందని కాంగ్రెస్ స్టేట్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ గుర్తుచేశారు. రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కును కాపాడుకోవడం, వినియోగించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ఓటు హక్కు రాజకీయాల కోసం మాత్రమే కాదని, మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో ఓటు హక్కూ అంతే అవసరమన్నారు. ఓటు ప్రతి ఒక్కరికీ సోషల్ స్టేటస్ అని అన్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, కొట్లాటలతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఓటు హక్కు వచ్చిందన్నారు. సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
Read Also: ఫేస్ స్కాన్ .. ఎయిర్‌పోర్టులో సరికొత్త టెక్నాలజీ..!
Follow Us On: Instagram

