సాగర్ జలాల దోపిడీకి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమా?: ‎ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

కలం, నల్లగొండ : ‘పల్నాడు వాటర్ గ్రిడ్’ (Palnadu Water Grid) పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగర్ జలాలను తరలిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (Nellikanti Satyam) ఆరోపించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎనిమిది నెలలుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. జలాల తరలింపు విషయం తెలిసినా.. కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ జలదోపిడీకి తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ అక్రమ జలాల తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం కలిసి దెబ్బతీస్తున్నాయని నెల్లికంటి సత్యం సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఇప్పటికైనా మౌనం వీడి నోరు విప్పాలని ఆయన హితవు పలికారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి జలదోపిడీని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ, వీర్లపాలెంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ పరిశ్రమను వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>