కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం ప్రభుత్వ సర్వజనాసుపత్రి (జీజీహెచ్) (Khammam GGH) లో ఓ బాలింత మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు.
బాధితుల కథనం ప్రకారం.. చింతకాని మండలం నాగిలిగొండ గ్రామానికి చెందిన రత్నకుమారి (36) ఏడు నెలల గర్భిణి. ప్రసవం కోసం ఈ నెల 17న ఆమెను ఖమ్మం జీజీహెచ్‌లో చేర్పించారు. 18వ తేదీన వైద్యులు శస్త్రచికిత్స (సిజేరియన్) నిర్వహించగా, ఆమె ఒక శిశువుకు జన్మనిచ్చారు. నెలలు నిండకముందే పుట్టడంతో తక్కువ బరువుతో ఉన్న ఆ పసికందుకు వైద్యులు ప్రస్తుతం ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అయితే, శస్త్రచికిత్స జరిగిన తర్వాత బాలింత రత్నకుమారి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందారు.
తల్లి మృతితో కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం జరిగిందని ఆరోపిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఆసుపత్రి అధికారులు, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

